Yatra Trailer: 7 Major Questions We Have


Yatra Trailer: 7 Major Questions We Have

యాత్ర ట్రైలర్: సమాధానం లభించాల్సిన 7 ప్రధాన ప్రశ్నలు

దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాపితంగా జరిపిన పాదయాత్ర ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ వంటి థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్సార్‌గా మలయాళ సీనియర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానున్నది. రెండు వారాల క్రితం విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి ఆదరణే లభించింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో విడుదల చేసిన ట్రైలర్‌ను 27.68 లక్షల మంది వీక్షించారు. ఒక వాస్తవికానుభవాన్ని ‘యాత్ర’ ఇవ్వనుందనే అభిప్రాయాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వాటికి సినిమా ఎలాంటి జవాబిస్తుందో చూడాలి.

కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అంశం.. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నప్పారా! అనేది. రాజశేఖరరెడ్డిది నవ్వు ముఖం. గుండ్రటి ముఖం. మమ్ముట్టిది అందుకు భిన్నమైన ముఖం. సినిమాలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది. పైగా ఆ పాత్రకు మమ్ముట్టి స్వయంగా చెప్పిన డబ్బింగ్ కూడా నప్పినట్లు కనిపించడం లేదు. రాజశేఖరరెడ్డి వాయిస్ చాలామందికి సుపరిచితం. మలయాళీ అయిన మమ్ముట్టి ఎంత బాగా తెలుగు డైలాగులు చెప్పడానికి యత్నించినా డిక్షన్‌లో తేడా తెలిసిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించాలంటే సినిమాని పకడ్బందీ కథనంతో, సన్నివేశాలంతో తియ్యడం వినా వేరే దారి లేదు. ఈ విషయంలో అతనికి సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ గొప్పగా ఉపకరించాడని చెప్పాలి. ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాల్లోనే కెమెరా పనితనమేమిటన్నది అర్థమైపోతోంది.

Yatra Trailer: 7 Major Questions We Have
హైకమాండ్‌ను లెక్కచెయ్యని వైఎస్సార్

“ఇది పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం రెడ్డీ. సో యు హావ్ టు ఒబే పార్టీ ఆర్డర్స్” అంటాడు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు. “నా విధేయతనీ, విశ్వాసాన్నీ బలహీనతగా తీసుకోవద్దండీ” అంటాడు రాజశేఖరరెడ్డి. “రెడ్డీ సాబ్. మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి” అంటాడు నాయకుడు. “మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను. ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకెళ్లాల్సిందే” అని సమాధానమిస్తాడు రాజశేఖరరెడ్డి. అవసరమైతే పార్టీ హైకమాండ్‌ను ఖాతరు చెయ్యని, తన మాటకు, చేతకు తిరుగులేదని ప్రవర్తించేవాడిగా వైఎస్సార్‌ను దర్శకుడు చూపించాడా? తెలుసుకోవాల్సి ఉంది. పార్టీ హైకమాండ్‌నే కమాండ్ చేసేవాడిగా ఆయనను హీరోయిక్‌గా చూపించడం ఆయన అభిమానుల్ని సంతృప్తి పరుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒప్పుకుంటుందా?

Yatra Trailer: 7 Major Questions We Have
పాదయాత్ర ఉద్దేశం

“నాయకులుగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది” అని నేపథ్యంలో మాటలు వినిపిస్తుండగా రాజశేఖరరెడ్డి తన ఇంట్లో కుర్చీలో కూర్చున్నవాడల్లా లేచి, మూసివున్న తలుపులు తెరుస్తాడు. అంటే పాదయాత్రకు సిద్ధమయ్యాడన్న మాట! నిజానికి ఆయన పాదయాత్ర ఉద్దేశం జనాభిప్రాయాన్నీ, వాళ్ల స్థితిగతుల్ని తెలుసుకోవడమా? లేక జనాన్ని ఆకర్షించి, జన నాయకుడిగా పేరు తెచ్చుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోడమా? ఈ విషయంలో వైఎస్సార్‌ను డైరెక్టర్ ఎలా ప్రొజెక్ట్ చేశాడు? చూడాలి.

Yatra Trailer: 7 Major Questions We Have
ఫలితాన్ని నిర్దేశించే ‘యాత్ర’

శంఖం పూరించి పాదయాత్ర మొదలుపెట్టాడు రాజశేఖరరెడ్డి. పాదయాత్ర సన్నివేశాల్ని ఉత్కంఠభరితంగా తీసినట్లు ట్రైలర్ నమ్మకం కలిగిస్తోంది. ఒక భారీ సినిమాలో సన్నివేశాలకు జనాన్ని సమీకరించినట్లు, ఆ పాదయాత్రలో పాల్గొనే జనాన్ని భారీ సంఖ్యలోనే సమీకరించి సన్నివేశాలు తీశాడు దర్శకుడు. పాదయాత్రలో సీనియర్ సుహాసిని కనిపిస్తున్న తీరునుబట్టి ఆమె సబితా ఇంద్రారెడ్డి పాత్రను చేసినట్లు తెలుస్తోంది. జనంతో ఆయన ఎలా మమేకమయ్యారో, ఎలా వారిలో ఒకడిగా కలిసిపొయ్యారో దర్శకుడు ప్రభావవంతంగా దర్శకుడు చూపించాడా?.. అనే విషయం చూడాలి. టైటిలే ‘యాత్ర’ కాబట్టి ఆ సన్నివేశాలే ఈ సినిమా ఫలితాన్ని నిర్దేశించనున్నాయి.

Yatra Trailer: 7 Major Questions We Have
‘ఆరోగ్యశ్రీ’తో పేదల ముఖ్యమంత్రి

“అన్నిటికన్నా అతి పెద్ద జబ్బు కేన్సరో, గుండెజబ్బో కాదయ్యా.. పేదరికం. పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా” అంటాడు ప్రభుత్వాసుపత్రిలో పేద ప్రజలతో. ఆ సందర్భంగా హాస్పిటల్లో వాళ్ల కష్టాలు చూసి చలించిపోయి మాట్లాడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’కి అదే కారణమని మనం ఊహించవచ్చు. ఆ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగిందో, పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్‌కు ఎంతటి గొప్ప స్థానం లభించిందో చరిత్రలో చూశాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజల హృదయాల్లో ఆయనకు లభించిన స్థానాన్ని దర్శకుడు పట్టుకోగలిగాడా? ఆ సన్నివేశాలను హృదయాలకు హత్తుకునేట్లు చూపించగలిగాడా?

Yatra Trailer: 7 Major Questions We Have
పార్టీని మించిన నాయకుడా?

ఒక పొడవాటి బ్రిడ్జిపై నాగినీడు “రాజశేఖరా.. నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే. నీ పార్టీక్కాదు” అనంటే, నవ్వు ముఖంతో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తాడు వైఎస్సార్. అక్కడ నాగినీడు ఒక రైతు వేషంలో ఉన్నట్లు కనిపించాడు. ఆ మాటలను బట్టి అప్పటివరకు కనిపించిన వైఎస్సార్ ఒకరైతే, అప్పుడు కనిపిస్తున్న వైఎస్సార్ వేరనీ, ఆయన స్వభావంలో మార్పు వచ్చిందనీ, అదే నాగినీడు పాత్రని ఆకట్టుకొన్నదనీ అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కాక నీకే ఓటేస్తానని అనడం పార్టీని మించి వైఎస్సార్ ఎదిగారని ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించాడా? అనే ప్రశ్న మెదులుతుంది.

Yatra Trailer: 7 Major Questions We Have
జన హృదయ నేత

పాదయాత్ర తర్వాత లభించిన అమేయమైన ఇమేజ్‌తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్‌కే ముఖ్యమంత్రి పదవి లభించింది. ఆ పదవిలోకి వచ్చాక జనంలోకి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు వైఎస్సార్. ఆ సన్నివేశాల్ని దర్శకుడు ఎంత ఆకర్షణీయంగా తీశాడో చూడాలి. హాస్పిటల్ బెడ్‌పై పేషెంట్ (శేఖర్) ఏదో చెప్పడానికి యాతన పడుతుంటే డాక్టర్ “సార్. తనేమీ మాట్లాడలేడు సార్” అంటాడు ఆదుర్దాగా. ఆ డాక్టర్ వైపు తలతిప్పి సీరియస్‌గా చూస్తూ “నాకు వినపడుతుందయ్యా” అంటాడు. అప్పుడు ఆయన కళ్లల్లో కోపం స్పష్టంగా తెలుస్తోంది. రోగుల కష్టాలను, హాస్పిటళ్లలో వాళ్లు పడుతున్న అవస్థలను ఆయన తెలుసుకున్నాడని ఆ సన్నివేశం ద్వారా మనకు తెలుస్తోంది. రోగి మాట్లాడలేకపోతున్నా, అతను పడుతున్న అవస్థ, అతని ముఖంలో ప్రతిఫలిస్తున్న బాధా ఆయన అర్థం చేసుకున్నాడని అవగతమవుతుంది. అయితే జన నాయకుడిగా వైఎస్సార్‌ను ఎంత బాగా దర్శకుడు ప్రొజెక్ట్ చేశాడనేది కీలకం.

Yatra Trailer: 7 Major Questions We Have
జగన్‌కు లాభించే చిత్రమా?

అంతిమంగా ఈ సినిమా వై.ఎస్. జగన్మోహనరెడ్డికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోషన్‌గా ఉపయోగపడనున్నదా? జగన్ సైతం ఇటీవలే పాదయాత్ర చేశారు. వైఎస్సార్ యాత్రను చూపిస్తే జగన్ చేసిన యాత్రను చూపించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఆ యాత్ర ఇంపాక్ట్‌ను ఎన్నికల వరకు నిలిపే అవకాశం ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. ఇది ఎన్నికల్లో జగన్ పార్టీకి లాభిస్తుందని ఆ పార్టీ నాయకులూ భావిస్తున్నారు. అందుకే సినిమాలో కాంగ్రెస్ పార్టీని కాకుండా వైఎస్సార్‌నే హైలైట్ చేశారని వినిపిస్తోంది. పాదయాత్ర సన్నివేశాల్లో ప్రదర్శించిన జెండాల్లో కాంగ్రెస్ పార్టీ పేరు కాకుండా వైఎస్సార్ పేరు, ఆయన రూపమే ఎక్కువగా కనిపిస్తోంది. ‘ప్రజా ప్రస్థాన యాత్ర’ అనే అక్షరాలు పెద్దగా కనిపిస్తున్నాయి కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కనిపించడం లేదు, హస్తం గుర్తు తప్ప. అందులో ఎంత నిజముందో ఫిబ్రవరి 8తో స్పష్టం కానున్నది.

  • బుద్ధి యజ్ఞమూర్తి