35 Years Of Raktha Sambandham: Must Watch Movie From Krishna


35 Years Of Raktha Sambandham: Must Watch Movie From Krishna

35 ఏళ్ల ‘రక్త సంబంధం’

కృష్ణ నట జీవితంలో ఒక మణిపూస లాంటి సినిమా ‘రక్త సంబంధం’. నటుడిగా ఆయనను ప్రపంచానికి చాటిన సినిమాల్లో ఇదొకటి. ఇందులో కృష్ణ తండ్రీ కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశారు. తండ్రి చక్రవర్తిగా, కొడుకులు కృష్ణ, విజయ్‌గా మూడు భిన్న పాత్రలను ఉన్నత స్థాయిలో పోషించారు. గంభీరంగా కనిపించే చక్రవర్తి పాత్రలో గొప్పగా అనిపిస్తారు. ఆవేదన జ్వాల దహించే కృష్ణగా అపూర్వ నటన ప్రదర్శించారు. చిలిపితనం, అమాయకత్వం కలగలసిన విజయ్‌గా ముచ్చట గొలిపారు.

చక్రవర్తి భార్య పాత్రలో జయంతి, విజయ్ ప్రియురాలిగా రాధ కనిపిస్తారు. డాక్టర్ రాజారావు పాత్రలో సత్యనారాయణ గురించి చెప్పాల్సిన పనిలేదు.

విజయనిర్మల దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా ఒక నిదర్శనం. ఆమె కల్పించిన ప్రతి సన్నివేశమూ ఆకట్టుకుంటుంది. సత్యానంద్ మాటలు, ఆత్రేయ, వేటూరి పాటలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. చక్రవర్తి సంగీతం వీనుల విందయితే, వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం కనుల విందు.

కథా సంగ్రహం

పాతికేళ్ల పాటు అనాథలా బతికిన యువకుడికి తన తల్లిదండ్రులున్నారనే విషయం తెలుస్తుంది. కన్నవాళ్లను కళ్లారా చూడాలని అర్ధరాత్రి వేళ చాటుగా ఆ ఇంటికి వెళ్తాడు. నిద్రిస్తున్న తల్లిని చూసి మనసులో ఆమె రూపాన్ని ఒక దేవతలా నింపుకుంటాడు. తల్లిప్రేమకై తల్లడిల్లిన హృదయం కొంత ఊరడిల్లుతుంది. తమ్ముడి చిత్రపటం చూసి హృదయానికి హత్తుకుంటాడు. అంతలో తమ్ముడే ఆ గదిలోకి వస్తాడు. గుడ్డి వెలుగులో ఆగంతకుడిని చూసి “దొంగ.. దొంగ” అని కేక వేస్తాడు. తమ్ముడిని చూసిన ఆనందంలో అతడిని గాఢంగా హృదయానికి హత్తుకుంటాడు యువకుడు. తమ్ముడు కొట్టే దెబ్బలు అతనికి ఆనందాన్నే కలిగిస్తాయి.

అతని తండ్రి పేరు చక్రవర్తి. అతను అందవిహీనుడు. అతనికి పుట్టిన మొదటి కొడుకు అతనిలాగే అందవికారంగా పుడతాడు. వికారిగా ఈ సమాజంలో తనెంత మానసిక హింస అనుభవించాడో చక్రవర్తికే తెలుసు. అందుకే పసిబిడ్డను చంపేయమని తన మిత్రుడైన డాక్టర్ రాజారావును కోరతాడు. కానీ డాక్టర్ ఆ బిడ్డను మేరీకి అప్పగిస్తాడు. ఆమె వాత్సల్యంలోనే పెరిగి పెద్దవాడవుతాడు కృష్ణ.

చక్రవర్తి రెండో కుమారుడు విజయ్ చాలా అందగాడు. తండ్రికి అతడంటే ప్రాణం. మేరీ చనిపోతూ కృష్ణకు అతడి తల్లిదండ్రుల గురించి చెబుతుంది. డాక్టర్ రాజారావును కలుసుకుంటాడు కృష్ణ. తల్లిదండ్రులు తనను అనాథలా ఎందుకు వదిలేశారని అడుగుతాడు. తన రూపమే అందుకు కారణమని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. కన్నవాళ్లను చూడాలనే కోరిక ఉరకలు వేస్తుండగా రాత్రివేళ వెళ్తాడు.

తారాగణం: కృష్ణ (చక్రవర్తి, కృష్ణ, విజయ్), రాధ (రాధ), జయంతి (అన్నపూర్ణ), సత్యనారాయణ (రాజరాం), మాస్టర్ సురేశ్, గిరిబాబు, సుదర్శన్, సుత్తి వేలు, సుత్తి వీరభద్ర రావు, రమాప్రభ, అన్నపూర్ణ, జ్యోతిలక్ష్మి

సంభాషణలు: సత్యానంద్

పాటలు: ఆత్రేయ, వేటూరి

నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి

సంగీతం: చక్రవర్తి

సినిమాటోగ్రఫీ: వీఎస్ఆర్ స్వామి

ఎడిటింగ్: ఆదుర్తి హరినాథ్

ఆర్ట్: తోట యాదు

ఫైట్స్: రాజు

కొరియోగ్రఫీ: శ్రీనివాస్

సమర్పణ: కృష్ణ

నిర్మాతలు: ఎమ్మెస్ ప్రసాద్, ఆదుర్తి భాస్కర్

దర్శకత్వం: విజయనిర్మల

బేనర్: రవి కళామందిర్

విడుదల తేది: 16 ఫిబ్రవరి 1984

35 Years Of Raktha Sambandham: Must Watch Movie From Krishna