ABCD: Release Date Changed, Clarity Or Confusion?


ABCD: Release Date Changed, Clarity Or Confusion?

మారిన ‘ఏబీసీడీ’ రిలీజ్ డేట్.. ఈ సారైనా క్లారిటీ ఉన్నట్లేనా?

అల్లు శిరీష్ హీరోగా పరిచయమై దాదాపు ఆరేళ్లు గడుస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ సినిమా ‘గౌరవం’తో అతను ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆడకపోయినా 2014లో వచ్చిన రెండో సినిమా ‘కొత్త జంట’తో హిట్ కొట్టాడు.

రెండేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’తో సూపర్ హిట్ సాధించి హీరోగా నిలదొక్కుకోగలడని అనిపించాడు. 2017లో వచ్చిన ‘ఒక్క క్షణం’ విమర్శకుల ప్రశంసలు పొందినా, ప్రేక్షకుల ఆదరణను ఆశించినంతగా పొందలేదు. ఇప్పుడు మలయాళ హిట్ ఫిల్మ్ ‘ఏబీసీడీ’ని అదే పేరుతో తెలుగులో చేస్తున్నాడు.

సంజీవ్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బేనర్లపై మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఆకతాయి’, ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేం రుక్సార్ థిల్లాన్ నాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదాపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మొదట ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. తర్వాత మూడు వారాలు వాయిదా వేసి, మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్లు సైతం విడుదల చేశారు. మళ్లీ ఏమైందో ఏమో, విడుదలను ఇంకో మూడు వారాలు వాయిదా వేశారు. తాజా విడుదల తేదీని మార్చి 21గా నిర్ణయించారు.

దీంతో టైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా ఉన్న ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’కి తగ్గట్లే రిలీజ్ డేట్ విషయంలో శిరీష్, దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారని సినీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఒక మలయాళ సినిమా సహా శిరీష్ ఇప్పటి వరకు చేసింది 5 సినిమాలు. ‘ఏబీసీడీ’ ఆరో సినిమా.

అయినా అతని కెరీర్ స్పీడ్‌గా సాగడం లేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అదే అతని అన్న అర్జున్ విషయానికి వస్తే రెండో సినిమా ‘ఆర్య’ నుంచే జెట్ స్పీడ్‌తో కెరీర్‌లో దూసుకుపోయిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్‌ను వదిలించుకొని సరైన రీతిలో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే శిరీష్ కూడా హీరోగా మంచి స్థానానికి చేరుకోగలడని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.