Adil Was Forced To Take Up The Gun, Says His Mother


Adil Was Forced To Take Up The Gun, Says His Mother
Adil (file)

భద్రతా బలగాల అతి వల్లే ఆదిల్ తుపాకీ పట్టాడు: తల్లి హమీదా ఆరోపణ

పుల్వామా దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే పోలీసులు తమ బంధువుల ఇళ్లపై దాడిచేసి, ఆదిల్ అహ్మద్‌ను సరెండర్ చేయించాలని అడిగారని అతని కుటుంబం చెబుతోంది. 40కి మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతికి కారణమైన పుల్వామా దాడికి నెలల ముందే ఆదిల్ కదలికలను ట్రాక్ చేయడానికి రక్షణ శాఖ అధికారులు ప్రయత్నించారని అంటోంది.

గత ఏడాది తమ ఇంటిపై భద్రతా బలగాలు దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టాయని ఆ కుటుంబం ఆరోపించింది. పలు అంతస్తుల ఆ ఇంటిలోని ఒక కిటికీ మంటలకు దెబ్బతిన్నదనీ, బలగాలు వెళ్లిపోయాక, స్థానికులు మంటలను ఆర్పివేశారనీ చెప్పింది.

ఆదిల్‌కు సహాయం చేస్తున్నాడనే ఆరోపణతో అతని కజిన్ అయిన తౌసీఫ్ అహ్మద్ దర్‌ను నాలుగు నెలల క్రితం భద్రతా బలగాలు నిర్బంధించాయి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అతనిపై అభియోగాలు మోపారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.

పుల్వామా దాడి జరగడానికి కొద్ది రోజుల ముందే మరో కజిన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారని ఆదిల్ కుటుంబ సభ్యురాలు ఒకరు చెప్పారు. కుటుంబం ద్వారా ఆదిల్‌ను సరెండర్ చేయించడానికి పోలీసులు ప్రయత్నించారని ఆమె తెలిపారు.

బలగాల అతి కారణంగానే ఆదిల్ తుపాకీ చేతబట్టే స్థితికి వెళ్లాడని అతని తల్లి హమీదా బానూ ఆరోపించారు. గతంలో పుల్వామా జిల్లాలోని గండిబాఘ్‌లో ఉన్న తన ఇంటికి సమీపంలో ఉన్న నేవా గ్రామలో జరిగిన ఒక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో ఆదిల్ గాయపడ్డాడు.

ఆ ఆందోళనలో గాయపడిన ఒకరికి సహాయ పడుతున్న సమయంలో ఆదిల్ కాలికి బుల్లెట్ గాయమైంది. దాంతో ఆస్పత్రి పాలైన ఆదిల్ కొన్ని నెల్ల పాటు మంచంపై ఉన్నాడని హమీదా తెలిపారు. ఆ తర్వాతే అతను ఇల్లు విడిచి, తీవ్రవాదిగా మారాడని ఆమె చెప్పారు.