Akhil’s Career: 3 Flops In A Row!


Akhil's Career: 3 Flops In A Row!
Akhil’s Career: 3 Flops In A Row!

అఖిల్ కెరీర్: ఫ్లాపుల హ్యాట్రిక్ పూర్తి

Akhil’s Career: 3 Flops In A Row!

అక్కినేని వారసుడిగా, అందగాడిగా సినిమాల్లోకి వచ్చిన అఖిల్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో ‘అఖిల్’ (2015) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు ప్రేక్షకుల నుంచి గ్రాండ్ వెల్‌కం లభించలేదు. కథ విషయంలో నేల విడిచి సాము చేయడంతో ప్రేక్షకులు ఆ సినిమాని పట్టించుకోలేదు. ఫలితంగా తొలి సినిమాతోనే డిజాస్టర్ సాధించాడనే పేరు తెచ్చుకున్నాడు. దాని తర్వాత తండ్రి సూచన మేరకు దర్శకుడిగా విక్రమ్ కుమార్‌ని ఎంచుకున్నాడు. అప్పటికే అక్కినేని మూడు తరాల కథానాయకులతో ‘మనం’ వంటి మంచి హిట్ సినిమాని విక్రమ్ అందించి ఉన్నాడు. పైగా అఖిల్‌ను క్లైమాక్స్‌లో చమక్కుమని మెరిపించాడు. కచ్చితంగా విక్రమ్ హిట్టునిస్తాడని ఎన్నో ఆశలతో ‘హలో’ సినిమా చేశాడు అఖిల్. హృదయాన్ని స్పృశించే సున్నితమైన ఆ కథను క్లాస్ ప్రేక్షకులు మెచ్చారు కానీ మాస్ ఆడియెన్స్ పక్కన పెట్టేశారు. దాంతో ఆ సినిమా కూడా బయ్యర్లకు లాభాలు అందివ్వని సినిమాగా నిలిచింది.

ఇప్పుడిక విషమ పరీక్షే. హిట్ కొట్టడం వినా వేరే దారి లేదు. అలాంటి స్థితిలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అఖిల్. తొలి సినిమా ‘తొలిప్రేమ’తో వెంకీ ఆకట్టుకోవడమే దానికి కారణం. రెండో సినిమా ‘హలో’లో ఇన్వాల్వ్ అయిన నాగార్జున ఈసారి అఖిల్ అభిప్రాయానికే ఓటేసి, తాను జోక్యం కలిగించుకోలేదు. ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందని కూడా వాళ్లు నమ్మారు. కాసనోవా టైపు కేరక్టర్‌గా అఖిల్ కేరెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసి, ఫ్యామిలీ మేన్‌గా కాసేపు చూపించి, సెకండాఫ్ అంతా హీరోయిన్‌ను ప్రసన్నం చేసుకోడానికి నానా తంటాలుపడే హీరో కేరెక్టర్‌ని చూసి జనం చికాకు పడ్డారే కానీ, అతడి బాధతో సహానుభూతి పొందలేకపోయారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ‘మిస్టర్ మజ్ను’ సైతం నిరాశాజనకంగా నడుస్తోంది. ఏ టాప్ హీరో వారసుడికీ ఇలాంటి వరుస చేదు ఫలితాలు ఎదురుకాలేదు. అఖిల్ అన్న నాగచైతన్య తొలి సినిమా ‘జోష్’ ఫ్లాపైనా రెండో సినిమా ‘ఏ మాయ చేశావే’తో హిట్ కొట్టి కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ మునుముందు ఏం చేస్తాడో చూడాల్సిందే.