మరోసారి ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్!


మరోసారి ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్!

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘118’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం (25 ఫిబ్రవరి) సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనున్నది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మహేశ్ కోనేరు తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలిపారు.

ఇదివరలోనూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌లో ఒకే వేదికపై కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఆ తర్వాత ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు మరోసారి కల్యాణ్‌రామ్ కోసం ఆ ఇద్దరూ ఒక వేదిక మీద వస్తున్నారు.

కె.వి. గుహన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘118’లో నివేదా థామస్, శాలినీ పాండే నాయికలుగా నటించగా, శేఖర్ చంద్ర స్వరాలు కూర్చారు. ఇప్పటికే ‘చందమామే’ పాట మంచి ఆదరణ పొందింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. మార్చి 1న ‘118’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.