Dev Review: 3 Ups And 4 Downs

‘దేవ్’ రివ్యూ: మూడడుగులు ముందుకి, నాలుగడుగులు వెనక్కి
దర్శకుడు: రజత్ రవిశంకర్
తారాగణం: కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రకాశ్‌రాజ్, నిక్కీ గల్రాణి, రమ్యకృష్ణ, కార్తీక్ ముత్తురామన్, ఆర్జే విఘ్నేశ్, రేణుక
విడుదల తేది: 14 ఫిబ్రవరి 2019
‘దేవ్’ అనేది ఇద్దరు ప్రేమికుల రొమాంటిక్ డ్రామా. వేలంటైన్స్ డేకి తగిన సినిమాగా దర్శక నిర్మాతలు భావించి ఇప్పుడు తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల చేశారు.
తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ హీరో కార్తి, ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గ్లామరస్ హీరోయిన్గా తన ముద్రను వేసిన రకుల్‌ప్రీత్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథ
దేవ్, విక్కీ, నిషా బాల్య స్నేహితులు. మనసు ఏం చెబితే అది చెయ్యమంటూ దేవ్ బలవంత పెడుతూ ఉండటంలో, ప్రశాంతంగా జీవితం గడపాలనుకొనే విక్కీ ఆ పని చెయ్యలేకపోతుంటాడు. ముగ్గురు స్నేహితులూ ఉక్రెయిన్‌లో చదువుకొనేప్పుడు, దేవ్‌తో వేగలేక, అతడిని వదిలించుకోడానికి ఒక స్కెచ్ వేస్తాడు విక్కీ.
ఆ ప్లాన్ వల్ల మేఘన అనే అమ్మాయి ప్రేమలో పడతాడు దేవ్. ఫేస్బుక్ ద్వారా ఆమె గురించి తెలుస్తుంది దేవ్‌కు. ఆ ఇద్దరూ భిన్న ధృవాల వంటివాళ్లు. ఆమె అమెరికాలో ఉంటే, దేవ్ ఉక్రెయిన్‌లో ఉంటాడు. మేఘన తండ్రిలేని పిల్ల అయితే, దేవ్ తల్లిలేని అబ్బాయి. ఆమె నిరాశావాది అయితే అతను ఆశావాది. ఆమె స్వార్థంగా ఆలోచిస్తే, అతను అందరి కోసం ఆలోచించే టైపు.
దేవ్‌ను మేఘన ప్రేమించిందా? తన సాహస కార్యాల వల్ల దేవ్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడు? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
కథనం
ఓపెనింగ్ సీన్తోటే ప్రేక్షకుల్ని కథలో లీనం చెయ్యడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకోవడానికి అతి సమీపంలో ఉండగా, ఒక హిమపాతం దేవ్‌ను కిందికి నెట్టేస్తుంది. దేవ్ కనిపించకుండాపోయిన విషయాన్ని బేస్ క్యాంప్ నుంచి ఒక న్యూస్ యాంకర్ చెబుతుంది.
అతను చనిపోయాడనే వదంతి వ్యాపిస్తుంది. కానీ మంచు కింద కూరుకుపోయిన దేవ్లో ఊపిరి ఉన్నట్లు కనిపించదు కానీ ఒక పేరునే జపిస్తుంటాడు.. ‘మేఘన’ అని.
హీరో హీరోయిన్ల పాత్రలు కలుసుకోవడం, ప్రేమలో పడటం ఎన్ని వందల, వేల సినిమాల్లో మనం చూసుంటాం! ‘దేవ్’ సైతం అందుకు మినహాయింపు కాదు. కాకపోతే ‘దేవ్’లో దేవ్, మేఘన పాత్రలను పరిచయం చేసిన తీరు కాస్త ఆసక్తికరంగా ఉంటుందంతే.
దేవ్ ఎక్కడ్నుంచి వచ్చాడో, మేఘన జీవితంలోని భావోద్వేగ కోణం ఏంటో మనకు తెలుసు. మగాళ్ల పట్ల మేఘన అపనమ్మకంగా ఉంటుందని చెప్పడమే కాకుండా, దాని వెనకున్న కారణాన్ని కూడా దర్శకుడు మనకు చెప్తాడు. అన్నీ అరటిపండు వలిచినట్లు చెప్పుకుంటూ పోతే కథనంలో ఉత్కంఠ ఏముంటుంది! ‘దేవ్’ అనేది ఇద్దరు ప్రేమికుల రొమాంటిక్ డ్రామా. వేలంటైన్స్ డేకి తగిన సినిమాగా దర్శక నిర్మాతలు భావించి ఇప్పుడు తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల చేశారు. దేవ్ ఎక్కడ్నుంచి వచ్చాడో, మేఘన జీవితంలోని భావోద్వేగ కోణం ఏంటో మనకు తెలుసు. మగాళ్ల పట్ల మేఘన అపనమ్మకంగా ఉంటుందని చెప్పడమే కాకుండా, దాని వెనకున్న కారణాన్ని కూడా దర్శకుడు మనకు చెప్తాడు. అన్నీ అరటిపండు వలిచినట్లు చెప్పుకుంటూ పోతే కథనంలో ఉత్కంఠ ఏముంటుంది!
చివరకు దేవ్ ఫ్రెండ్స్ అయిన విక్కీ, నిషల నేపథ్యాల గురించి కూడా మనకు వివరించాలని చూశాడు. దీని వల్ల కథకు జీవం వస్తుందని అతడు భావించి ఉండొచ్చు కానీ, కథనానికి అవి అవసరంలేని విషయాలే.
పతాక సన్నివేశాలు వచ్చే వరకూ కూడా కథలో ఘర్షణ లేకపోవడం కథనంలో దొర్లిన ప్రధాన లోపం. కథలో ఎలాంటి మలుపులూ లేకుండా సన్నివేశాలన్నీ మనం ఊహించినట్లే జరిగిపోతుంటాయి. కథనం బిగువుగా లేకపోవడంతో, దానికి అనుగుణంగా ఆసక్తీ లోపించి బోర్ ఫీలవుతాం.

తారల అభినయం
దేవ్ కేరెక్టర్‌ను ఎంతో సౌకర్యవంతంగా చేశాడు కార్తి. పాత్రను మించి ఆశావాదిగా, హుషారుగా, సాహసవంతంగా కనిపించాడు. ఒకమ్మాయిని గాఢంగా ప్రేమించి, ఆమె కోసం ఎలాంటి సాహసానికైనా వెనుకాడని పాత్రలో బాగా రాణించాడు. అతడి నటనకు తగ్గ స్థాయిలో స్క్రిప్ట్ లేకపోవడం మైనస్.
మేఘన పాత్రలో రకుల్‌ప్రీత్ ఇమిడిపోయింది. కార్తికి సరైన్ జోడీగా తెరపై అలరించింది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ తక్కువ పరిధిలోని పాత్రల్ని తమ శైలిలో చేసుకుపోయారు. అలాంటి నటులను పెట్టుకొని వాళ్ల పాత్రల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడి లోపం స్పష్టం. దేవ్ స్నేహితులైన విక్కీ, నిష పాత్రల్లో విఘ్నేశ్, అమృత బాగానే ఉన్నారనిపించారు. విఘ్నేశ్‌కు పరిధిపరంగా పెద్ద పాత్రే లభించింది.
దర్శకత్వం, సంగీతం
దర్శకుడిగా ‘దేవ్’తో పరిచయమయ్యాడు రజత్ రవిశంకర్. కానీ ఏమంతగా మెప్పించలేకపోయాడు. హీరో హీరోయిన్ల పాత్రల్లో ఎంతో కొంతైనా కొత్తదనం చూపిస్తే దర్శకుడిగా అతడి గురించి చెప్పుకోడానికి ఏమైనా ఉండేది. ప్రధానంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ‘విషయం’ సినిమాలో లేకపోవడం దర్శకుడి లోపమే.
దేవ్ తనతో ఎక్కువ సమయం గడపడం లేదని మేఘన అతడితో గొడవపడటం సిల్లీగా అనిపిస్తుంది. అది ఆమె కేరెక్టరైజేషన్లో దొర్లిన తప్పు. కొన్ని కొన్ని డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. “ఒకప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనేది ఒక కోరిక, ఇప్పుడు అవసరం” వంటివి అందుకు ఉదాహరణ.
హారిస్ జైరాజ్ సంగీతం వినసొంపుగానే ఉంది. రెండు పాటలు క్యాచీగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే.
చివరి మాట
కొత్తదనం లేని కథ, పాత్రలు, హాస్యాస్పదం అనిపించే సన్నివేశాలతో ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయిన రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా ఎందుకు చూడాలనుకొంటే చెప్పుకొనేది ఒక్క కార్తి నటన కోసమే.