అలాంటి సినిమాలు చెయ్యను


అలాంటి సినిమాలు చెయ్యను
Shalini Pandey

“స్త్రీలను కేవలం ఒక వస్తువుగా మాత్రమే చూపించే సినిమాలు నేను చెయ్యను. తెరపై నేను చేసే పాత్రల విషయంలో ఒక స్త్రీగా నేను బాధ్యతని ఫీలవుతాను” అంటోంది జబల్పూర్ అమ్మాయి షాలినీ పాండే.

నటిగా తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది షాలిని. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో అతిథి పాత్ర పోషించి ఇప్పుడు ‘118’ సినిమాలో ఒక నాయికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శుక్రవారం ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా షాలిని చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే…

పాత్రల ఎంపిక విషయానికొస్తే నేనంత కాలిక్యులిటివ్‌గా ఉండను. ఒక సినిమా చెయ్యాలంటే మరీ ఎక్కువగా దాని గురించి ఆలోచించను. చెయ్యాలనిపిస్తే చేసేస్తా. కథ వినేప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తే చాలు. కథ విన్నాక ఒక రోజు టైం అడుగుతాను. ఆ రాత్రి ఆలోచించుకుంటాను. పొద్దున్నే లేచాక దానిపై నిర్ణయం తీసేసుకుంటా.

అలాంటి సినిమాలు చెయ్యను
కథకు నా పాత్ర కీలకం

ప్రేక్షకులకి అంచనాలుంటాయని తెలుసు. తమను ఆకట్టుకొనే, నటించడానికి ఆస్కారముండే పాత్రల్లో నన్ను చూడాలనుకోవచ్చు. కానీ ఒక నటిగా, కొన్నిసార్లు చాలా సింపుల్‌గా అనిపించే పాత్రలు కూడా చెయ్యాలనిపిస్తుంది. ఉదాహరణకి, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నేను చేసిన ప్రీతి పాత్రలో పోలిస్తే ‘118’లో నాదేమంత ఎమోషనల్ రోల్ కాదు, అలాగే హార్డ్-హిట్టింగ్‌గా కూడా ఉండదు.

కానీ కథకు నా పాత్ర కీలకం. నాకు స్క్రిప్ట్ నచ్చింది. గుహన్‌గారు చాలా బాగా స్క్రిప్టును మలిచారు. అందులో భాగం కావాలనుకొని చేశాను. రిస్కులు తీసుకోవడానికి నేను సిద్ధమే. అన్నింటికంటే ఆత్మ సంతృప్తి, ఆ పాత్ర కలిగించే ప్రభావం ముఖ్యమని నేననుకుంటా.

హీరో జర్నీ

‘118’ను క్రైం థ్రిల్లర్ అంటే నేనొప్పుకోను. ప్రత్యేకించి ఒక జోనర్ సినిమా అని దాన్ని చెప్పలేమనుకుంటా. అయితే చెప్పాల్సి వస్తే, దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అనొచ్చు. ఇది ఒక కథానాయకుడి జర్నీ. ఆ జర్నీలో అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితులు అతడ్ని ఎలా మార్చాయన్నది కథాంశం. ఇంతకంటే ఎక్కువ చెబితే, కథను బయటపెట్టేసిందాన్నవుతాను.

స్వచ్ఛమైన మనిషి

సినిమా కంటే ఎక్కువగా, దానికి పనిచేసిన అనుభవమే మనకు మిగులుతుంది. కల్యాణ్‌రాం, నివేదా థామస్ ఇద్దరూ అద్భుతమైన సహ నటులు. నివేదాతో నాకెక్కువ కాంబినేషన్ సీన్లు లేవు. మొదట్లో కల్యాణ్ చాలా మొహమాటస్తుడిలా కనిపించాడు. తర్వాత మా ఇద్దరి మధ్యా మంచి రాపో ఏర్పడింది. అతను శ్రమించే నటుడు మాత్రమే కాదు, చాలా స్వచ్ఛమైన మనిషి కూడా.

సెన్సిటివ్‌గా ఉండటం ముఖ్యం

తానేం చేస్తున్నాననే క్లారిటీతో డైరెక్టర్ ఉన్నాడనిపించినప్పుడు కూడా నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే ఒక మంచి దర్శకుడు చాలా సింపుల్ స్క్రిప్టును కూడా చాలా చక్కని సినిమాగా మలచగలడనుకుంటా. ఏ డైరెక్టరైనా, స్త్రీలను అర్థం చేసుకొని, సినిమాల్లోని స్త్రీల పాత్రల విషయంలో సెన్సిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. స్త్రీలను కేవలం ఒక వస్తువుగా మాత్రమే చూపించే సినిమాలు నేను చెయ్యను. తెరపై నేను చేసే పాత్రల విషయంలో ఒక స్త్రీగా నేను బాధ్యతని ఫీలవుతాను.

ఇండస్ట్రీలో ఇదొక లోపం

ఇండస్ట్రీలో స్త్రీలపై వివక్ష ఉంది. స్త్రీలను వస్తువులుగా చూపించడం అలవాటైంది. హీరోయిన్ అంటే చాలా అందంగా, స్లింగా, సుకుమారంగా కనిపించాలన్నట్లు భావిస్తుంటారు. ‘అర్జున్‌రెడ్డి’లో నాకు బాగా నచ్చింది డైరెక్టర్ సందీప్ తన హీరోయిన్ అలా ఉండాలని అనుకోకపోవడం. ఎందుకంటే మనం అన్ని సందర్భాల్లోనూ రూపం చూసినంత మాత్రాన ఇష్టపడం. వ్యక్తిత్వం చూసి ఇష్టపడతాం. ఇండస్ట్రీలో ఇదొక లోపం.

ఇక్కడ స్త్రీలెప్పుడూ కంటికి అందంగా కనిపించాలి. ఒకట్రెండు పాత్రలు అలాంటివి చేయొచ్చు కానీ, ఎప్పుడూ అలాంటి పాత్రలే చెయ్యాలంటే కష్టం. అర్థవంతమైన పాత్రలకే నా ప్రాధాన్యం. కథలో ఆ పాత్ర ఎందుకున్నదనేది నేను తెలుసుకుంటా. కథను మరో స్థాయికి తీసుకెళ్లే స్త్రీ పాత్రల్ని ఈ ఇండస్ట్రీ ఎందుకు ప్రోత్సహించదో నాకైతే అర్థం కాదు.

అలాంటి సినిమాలు చెయ్యను