Insulting Slap Leads Murder

హత్యకు దారి తీసిన చెంపదెబ్బ
ముంబైలోని కందివాళి పోలీసులు 27 ఏళ్ల ఉమేశ్ నారాయణ్ నాయర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఒక గొడవ విషయంలో తనను చెంపదెబ్బ కొట్టాడని తోటి అపార్ట్మెంట్ వాసిని హత్య చేశాడనేది అతనిపైనున్న అభియోగం. పోలీసు వర్గాల ప్రకారం ఈ ఘటన గురువారం (ఫిబ్రవరి 14) రాత్రి చోటు చేసుకుంది. తనను చెంపపై కొట్టినందుకు ప్రతీకారంగా దీపక్ ఘాగ్ (52) అనే వ్యక్తిని ఉమేశ్ ఒక సిమెంట్ శ్లాబ్‌తో తలపై మోది చంపేశాడు.
కందివాళి పోలీసులు చెప్పిన దాని ప్రకారం నాయర్ ఒక సేల్స్‌మన్ కాగా, ఘాగ్ ఒక రిటైర్డ్ ఉద్యోగి. ఇద్దరూ కందివాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుకర్ వాడిలో ఉన్న శివశంకర్ స్లం రిహాబిలిటేషన్ అథారిటీ భవనవాసులే.
కొన్ని రోజుల క్రితం ఆ భవన్ వాచ్‌మన్‌తో అక్కడే ఇంకో భవనంలో ఉంటున్న వ్యక్తి గొడవపడ్డాడు. దానిపై సొసైటీ సభ్యులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. గొడవపడ్డ వ్యక్తిపై వాచ్‌మన్ చేత పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలా, లేక ఆ గొడవను సామరస్యంగా పరిష్కరించాలా అనే విషయం చర్చించారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, అసంపూర్ణంగా సమావేశం ముగిసింది. అందరూ అక్కడి నుంచి వెళ్లాక, నాయర్, ఘాగ్ మధ్య దీనిపై వివాదం చెలరేగింది. మాటా మాటా పెరగడంతో ఘాగ్ కోపం ఆపుకోలేక నాయర్ చెంపపై గట్టిగా కొట్టాడనీ, దాంతో నాయర్ సైతం పట్టలేని ఆవేశంతో బిల్డింగ్ ఆవరణలో పెట్టివున్న ఒక సిమెంట్ శ్లాబ్ తీసుకొని ఘాగ్ తలపై బలంగా మోదాడనీ పోలీసులు తెలిపారు.
అపస్మారకంలోకి వెళ్లిన ఘాగ్ కిందపడటంతో తలకు మరిన్ని దెబ్బలు తగిలి, పరిస్థితి విషమించింది. వెంటనే అతడిని దగ్గరలోని శతాబ్ది హాస్పిటల్‌కు తీసుకుపోయారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాయర్‌ను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.