కొత్తదనం కోసం అన్వేషిస్తూనే ఉంటా!


కొత్తదనం కోసం అన్వేషిస్తూనే ఉంటా!

కొన్నేళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈసారి ఆ విజయం తప్పదనే నమ్మకంతో ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా తెలిసిన కె.వి. గుహన్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేసిన ‘118’ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో ఆసక్తికరమైన పాత్రతో మనముందుకు వస్తున్నాడు.

నివేదా థామస్, శాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు. మార్చి 1న ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కల్యాణ్‌రామ్ తో చేసిన చిట్ చాట్…

ఈ సినిమాలో మీ కేరెక్టర్ ఏమిటి?

మునుపటి సినిమా ‘నా నువ్వే’లోనూ నేను జర్నలిస్ట్‌గా చేశాను కానీ ‘118’లో దానికి భిన్నమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించా. డైరెక్టర్ గుహన్ తన జీవితంలో నిజంగా జరిగిన ఒక ఘటన ఆధారంగా ఈ కథను తయారుచేశారు. అది విన్నప్పుడు నాకు చాలా ఉద్వేగంగా అనిపించే ఓకే చెప్పేశాను.

ఇందులోని సబ్జెక్ట్ ఏంటి?

ఇది థ్రిల్లర్ కాబట్టి కథేమిటన్నది ముందే చెప్పకూడదు. గుహన్ కథనం ఈ సినిమాకు ఆయువుపట్టు. నివేదా పోషించిన పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ప్రధానంగా ఇది స్క్రీన్‌ప్లేపై ఆధారపడి నడిచే సినిమా. ఇది థ్రిల్లరే కానీ అతీంద్రియశక్తుల సినిమా కాదు.

‘118’ అనే టైటిల్ వెనుకేమైనా కారణముందా?

 ‘118’ అనేది టైంను సూచిస్తుందని ట్రైలర్‌లోనే సూచించాం. కథకు అది పక్కాగా యాప్ట్ అయ్యే టైటిల్. నిజానికి మొదట ‘అన్వేషణ’, ‘రక్షణ’ అనే టైటిల్స్ కూడా పరిశీలించాం కానీ అవి సాధారణంగా అనిపించాయి. చివరకు ‘118’ సరిగ్గా సరిపోతుందని భావించి దాన్ని ఫిక్స్ చేశాం. టైటిల్‌కు రెస్పాన్స్ చాలా బాగుంది.

ఇందులో పాలిటిక్స్ ఏమైనా కనిపిస్తాయా?

సినిమాలో ఎలాంటి రాజకీయపరమైన అంశాలు ఉండవు. ఇది రాజకీయాల స్పర్శ ఉండని ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిచే సినిమా. ప్రేక్షకులు ఒక ఫీల్‌తో థియేటర్ల నుంచి బయటకు వస్తారు.

ఈ సినిమాకి సంబంధించి మంచి అనుభవమేమైనా ఉందా?

షూటింగ్ నిమిత్తం ఎలా ఈత కొట్టాలో ఈ సినిమా వల్ల నేర్చుకున్నా. ముంబైలో మూడు రోజులు నీళ్లలో షూటింగ్ చేశాం. అప్పుడు నీళ్లలో సీన్లు తియ్యడానికి ఎలా ఈత కొట్టాలో నేర్చుకోవడం మంచి అనుభవం.

సినిమాలో కొత్తగా ఏం చేశారు?

ఈ మధ్య నేను చేసిన సినిమాలు చూస్తే, కొత్తగా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నానని అర్థమవుతుంది. ఫలితంతో నిమిత్తం లేకుండా, కాన్‌స్టంట్‌గా ప్రయోగాలు చెయ్యడానికీ, కొత్తగా ఏదైనా చెయ్యడానికీ చూస్తున్నా. ‘118’లోనూ కొత్తదనం కోసం ప్రయత్నించా. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు వాళ్లని అమితంగా ఆకట్టుకుంటాయని గట్టిగా చెప్పగలను.

మీరు వెబ్ సిరీస్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి…

అవును. ఒక వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నా. అది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అతి త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తా.

One thought on “కొత్తదనం కోసం అన్వేషిస్తూనే ఉంటా!

Comments are closed.