Katrina Kaif Denies Signing Any Film With Mahesh

మహేశ్‌తోనా.. అలాంటిదేం లేదు: కత్రినా
మహేశ్ సరసన కత్రినా కైఫ్! వినడానికి చాలా బాగుంది. అది నిజమైతే? కానీ ఇప్పట్లో ఆ అవకాశం లేదని స్పష్టమైపోయింది. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే.. సుకుమార్ డైరెక్షన్లో మహేశ్ నటించబోయే సినిమాలో నాయికగా కత్రినాను సంప్రదిస్తున్నారనే ప్రచారం రావడం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘మహర్షి’ సినిమా చేస్తున్న మహేశ్, ఏప్రిల్‌లో ఆ సినిమా విడుదల తర్వాత సుకుమార్ సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే హీరోయిన్ను ఎంపిక చెయ్యాలనేది సుకుమార్ ఆలోచన. ఆ క్రమంలో కత్రినా పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే సుకుమార్ ఆమెను సంప్రదించాడని కూడా ప్రచారం చేశారు ఉబుసుపోనివాళ్లు. అయితే మహేశ్ సినిమా కోసం తననెవరూ సంప్రదించలేదని తేల్చేసింది కత్రినా. అంటే ఈ గాసిప్స్ విషయం ఆమె దాకా వెళ్లిందన్న మాట. ప్రస్తుతం ఆమె హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘భారత్’ సినిమా చేస్తోంది. ఆ సినిమా తర్వాత మరే సినిమాకూ తాను సంతకం చెయ్యలేదని కూడా తెలిపింది కత్రినా.
“తెలుగులో మహేశ్‌తో సినిమా చేస్తున్నారని అంటున్నారు.. నిజమేనా?” అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు “నో, నో.. ‘భారత్’ తర్వాత నేనే సినిమాకీ సంతకం చెయ్యలేదు. నేను కేవలం స్క్రిప్టులు చదువుతున్నా, వింటున్నా. ఇప్పుడు నా ఫోకస్ అంతా ‘భారత్’ మీదే. అందులో నాది బలమైన పాత్ర. దాని ప్రిపరేషన్ వర్క్ నుంచి షూటింగ్ జరిగే ప్రాసెస్‌ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నా. ఆ పాత్ర నుంచి చాలా నేర్చుకున్నా. సెట్స్‌పై ఉద్వేగానికి గురవుతూ, ఒక సంపూర్ణ అనుభవాన్ని చవిచూస్తున్నా” అని చెప్పింది కత్రినా.