Lakshmi’s NTR Trailer: Lakshmi Parvathi’s Feedback


Lakshmi's NTR Trailer: Lakshmi Parvathi's Feedback
Lakshmi Parvathi

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించినవి నిజాలు కాదనే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉన్నాయా?: లక్ష్మీపార్వతి

అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రూపొందించిన రాంగోపాల్ వర్మ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పటికే దానికి 4.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్ష్మీపార్వతి దృష్టి నుంచి ఎన్టీఆర్ జీవితాన్ని చూపించానని ఇదివరకే వర్మ ప్రకటించాడు. మరి ఆ ట్రైలర్ చూసి లక్ష్మీపార్వతి ఏమన్నారు?

“లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది పూర్తి నిజమైన సినిమా. ఎన్టీఆర్ బయోపిక్ అనేదానికి అది నిజమైన అర్థం. జీవితంలో ఎన్టీఆర్ ఎంతో కష్టపడిన తర్వాత సినిమాల్లో ఆయనకు చాలా పేరొచ్చింది. అవి అందరికీ తెలిసిన అంశాలే. కానీ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీని రహస్యం” అని టీవీ చానళ్లకు చెప్పారు లక్ష్మీపార్వతి.

చంద్రబాబునాయుడు, అతని మద్దతుదారులు ఏం స్టోరీ చెప్పారో, వాళ్ల అనుకూలమైన మీడియా ఏం రాసిందో అదే నిజమని ప్రజలు నమ్ముతూ వచ్చారని ఆమె అన్నారు.

“దాన్ని ఎదిరిస్తూ 23 సంవత్సరాలుగా కంటిన్యూగా పోరాటం చేస్తూనే వచ్చాను. ఇవాళ ఆర్జీవీ గారి రూపంలో ఈ బయోపిక్‌కు ఇలాంటి గుర్తింపు రావడం, ట్రైలర్ పెట్టిన గంటలోనే 10 లక్షల మంది వ్యూయర్స్ అంటే.. నిజం చూడాలని ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది” అని చెప్పారు లక్ష్మీపార్వతి.

ప్రజలెప్పుడూ మంచివాళ్లే ననీ, కాకపోతే వాళ్లని తప్పుదారి పట్టించే మీడియా, కొంతమంది నేతల వల్లే చరిత్ర అనేది సమాధి అవుతుంటుందనీ ఆమె అన్నారు.

Lakshmi's NTR Trailer: Lakshmi Parvathi's Feedback
A still from Lakshmi’s NTR

“ఒక అబద్దపు చరిత్రను తుడిచేసి, అందులో వాస్తవ చరిత్రను పెట్టి జరిగింది ఇదని వర్మ గారు సాక్ష్యాలతో సహా ప్రజల కళ్ల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ చూస్తే.. అందులోని ప్రతి సంఘటనా వాస్తవమే. కొంచెం సమయం ట్రైలర్‌లోనే ఎన్ని వాస్తవాలు చూపించారో! అవి చూసి నా కళ్లవెంట నీళ్లొచ్చాయి” అని లక్ష్మీపార్వతి తెలిపారు.

గతంలో తానొక్కదాన్నే సాక్ష్యమనీ, ఆ సంఘటనల్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు సాక్ష్యమనీ, కానీ ఆ వ్యక్తులు వెనక్కి వెళ్లిపోయారనీ, నిజాలు చెప్పలేకపోయారనీ అన్నారు.

“ఆ నిజాలు కావాలని నేను పోరాటం చేస్తూ ఉన్నాను. ఇన్నాళ్లకు ఆ నిజాలు బయటకు వచ్చినయి. కాదు అని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటే చెప్పొచ్చు” అని లక్ష్మీపార్వతి సవాలు విసిరారు.

ఇప్పుడు ఎన్టీఆర్ రియల్ బయోపిక్ వర్మ డైరెక్షన్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో ప్రజల ముందుకు రాబోతోందనీ, చూడకుండానే దానిమీద బురద చల్లొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

“టీడీపీ వాళ్లు ఎలాగూ చేస్తారు. మీరెంతో ప్రేమించే మీ అన్నగారి జీవితంలో ఎటువంటి విషాదకర సంఘటన చోటు చేసుకుందో, వాస్తవాలు అర్థం చేసుకొని, ఎన్నో అవస్థలు పడి సినిమా తీసిన వర్మగారికి మీ ఆశీస్సులివ్వమని కోరుతున్నా” అని అభ్యర్థించారు లక్ష్మీపార్వతి.

Lakshmi’s NTR Trailer