Lovers Day Review: 2 Ups And 5 Downs

‘లవర్స్ డే’ రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి
దర్శకుడు: ఒమర్ లులు
తారాగణం: రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్, నూరిన్ షరీఫ్, మాథ్యూ జోసెఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్రూపా, హరీశ్ పెరుమాన్న, అనీష్ జి. మీనన్, షాన్ సాయి
విడుదల తేది: 14 ఫిబ్రవరి 2019
ఒమర్ లులు మలయాళంలో డైరెక్ట్ చేసిన ‘ఒరు అడార్ లవ్’ సినిమాకు ఇది తెలుగు అనువాద రూపం. గత ఏడాది ఒక పాట ట్రైలర్లో ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుకొట్టిన విధానం దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించడంతో సహజంగానే ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది.
దాంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్లు చర్చించుకొని, కథలో మార్పులు చేసి, చాలా సన్నివేశాల్ని కొత్తగా తీసి వేలంటైన్స్ డే సందర్భంగా మలయాళంతో పాటు తెలుగు వెర్షన్నూ విడుదల చేశారు. ప్రియా వారియర్‌కు వచ్చిన క్రేజ్‌తో తెలుగు హక్కులు కూడా మంచి ధర పలికాయి.
కథ
డాన్‌బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్లస్ వన్‌లో చేరిన రోజే తన క్లాస్మేట్ ప్రియ (ప్రియా వారియర్)ను చూసి ప్రేమలో పడతాడు రోషన్ (రోషన్). అదే రోజు ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టేస్తాడు కూడా. అప్పట్నుంచీ అతడిపై ప్రేమ ఉన్నా ‘టచ్ మి నాట్’ టైపులో వ్యవహరిస్తుంటుంది ప్రియ.
తమ క్లాస్మేటే అయిన గాథా జాన్ (నూరిన్ షరీఫ్)తో రోషన్ చనువుగా ఉండటం చూసి, అసూయతో అనుమానం కూడా కలుగుతుంది ప్రియలో. గాథతో తనది స్నేహమంటాడు రోషన్. ప్రియకూ గాథ స్నేహితురాలే. ఇంతలో రోషన్ ఫోన్లో ఉన్న అసభ్య వీడియోలను అతడి స్నేహితుడు తాగిన మైకంలో వాళ్ల స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాడు.
ప్రిన్సిపాల్ వారం రోజుల పాటు రోషన్‌ను సస్పెండ్ చేస్తాడు. ఇది అవమానంగా భావించిన ప్రియ అతడితో బ్రేకప్ చెప్పేస్తుంది. గాథతో ప్రేమ నటిస్తాడు రోషన్. అది చూసి తట్టుకోలేక ప్రియ తనకు దగ్గరవుతుందనుకుంటాడు. గాథ కూడా అతడికి మనస్ఫూర్తిగా సహకరిస్తుంది.
అనుకున్నట్లే ప్రియ మళ్లీ రోషన్ దగ్గరకు వస్తుంది. కానీ రోషన్ మునుపటిలా ప్రియతో ప్రేమగా ఉండలేకపోతాడు. తన మనసిప్పుడు గాథను కోరుకుంటోందని అర్థమవుతుంది. మరోవైపు గాథ కూడా తనకు తెలీకుండానే రోషన్‌ను ప్రేమిస్తుంది. ప్రియకు రోషన్ మనసు అర్థమవుతుంది.
ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? ఎవరు ఎవరికి సొంతమయ్యారు? అసలు వాళ్ల జీవితాలు ఏమయ్యాయి? అనేది మిగతా కథ.

కథనం
ప్రేమ కథాచిత్రానికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఫీల్. అనుభూతి రాహిత్యంతో కథ నడుస్తుంటే ఆ సినిమా ఆకట్టుకొనే స్వభావాన్ని కోల్పోతుంది. కథలోని పాత్రల మధ్య ఘర్షణ ఉన్నా, సన్నివేశాల్ని ఆసక్తికరంగా, అలరించే విధంగా చిత్రించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు.
కాల్షియం కార్బోనేట్ (ఛఛొ3)ని హీరో ఫ్రెండ్ ‘కాకో3’ అని చెప్పడం వంటి స్వల్ప సందర్భాల్లో మాత్రమే సంభాషణలు నవ్వించాయి. మిగతా సినిమా మొత్తమ్మీద ఆ సంభాషణలు చాలా నాసిరకంగా కనిపిస్తాయి. డబ్బింగ్ సినిమాకు సంభాషణలే కీలకం. అవి నాణ్యంగా లేకపోతే ఫీల్ దెబ్బతినిపోతుందడానికి ‘లవర్స్ డే’ ఇంకో ఉదాహరణ.
సినిమాటోగ్రఫీ కూడా ఒక క్వాలిటీ సినిమాని చూస్తున్న ఫీల్‌ని ఇవ్వలేకపోయింది. హీరో బ్యాచ్ కొండల దగ్గరికి క్యాంపుకు వెళ్లిన సందర్భంలో ఆ కొండల్ని మాత్రం కెమెరా అందంగా చూపించింది. మిగతా సినిమా అంతా వెండితెర సినిమాని చూస్తున్న ఫీల్‌ని కాకుండా ఒక షార్ట్ ఫిలింని చూస్తున్న ఫీల్‌ని ఇస్తుంది.
బూతు వీడియోలను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చెయ్యడం పెద్ద తప్పేమీ కాదన్నట్లు చెప్పడం విలువల్ని మనం ఎంత గౌరవిస్తున్నామో అర్థమవుతుంది. తప్పు చేసిన విద్యార్థికి ప్రిన్సిపాల్ దండన విధించడం తప్పన్నట్లు చూపించాడు దర్శకుడు.
ఆ ప్రిన్సిపాల్‌ను పోలీస్ స్టేషన్‌కు రప్పించి, తప్పు చేసిన విద్యార్థులముందే ఎస్సై అవమానకరంగా ప్రవర్తించడం, సస్పెండ్ అయిన రోషన్ ప్రిన్సిపాల్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ రాశాడంటూ లేని ఉత్తరాన్ని సృష్టించడం, దీనికి ప్రినిస్పాల్ పైనే కేసు పెట్టాల్సి వస్తుందని అతని స్టూడెంట్ల ముందే బెదిరించడం దేన్ని సూచిస్తున్నట్లు? విద్యార్థులకి ఎలాంటి విలువల్ని నేర్పుతున్నట్లు?
తప్పుచేసిన వాడు ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఏం చేయవచ్చో ఈ సినిమాలో పాజిటివ్‌గా డైరెక్టర్ చూపించాడు.
రోషన్, ప్రియ దూరమవడానికి, రోషన్, గాథ దగ్గరవడానికి బలమైన సన్నివేశాలు కల్పించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ప్రియతో తనది ఆకర్షణ అనీ, గాథని తను ప్రేమిస్తున్నాననీ ఒక్క మాటతో రోషన్ చెప్పినా, ప్రేక్షకులు కన్విన్స్ కాలేరు. సినిమా ముగింపు చాలా సిల్లీగా అనిపిస్తుంది.
ప్రేక్షకుల సానుభూతిని ఆశించి అలా తీశారనిపిస్తుంది కానీ ఇలాంటి కథకు ఏ రకంగానూ అది సరిపోని ముగింపు. బాలచందర్ ప్రేమకావ్యం ‘మరో చరిత్ర’ ముగింపు స్ఫూర్తితో ఆ తరహాలో తియ్యాలనేది దర్శకుడి ఆలోచన కావచ్చు. అక్కడది కథకు తగ్గట్లు సరిపోయింది. కానీ ‘లవర్స్ డే’లో క్లైమాక్స్ సన్నివేశం బలవంతంగా కల్పించినట్లు ఉంటుంది. అసందర్భ ముగింపు.

నటీనటుల అభినయం
విడుదలకు ముందే కొన్ని చిన్న సినిమాలు ఏదో ఒక కారణంతో హైప్ క్రియేట్ చేస్తాయి. ‘లవర్స్ డే’కు వచ్చిన క్రేజ్ అంతా ప్రియా వారియర్ కన్నుకొట్టిన సన్నివేశానికే. కొద్ది రోజుల ముందు రిలీజ్ చేసిన టీజర్లో ప్రియ, రోషన్ మధ్య లిప్‌లాక్ కూడా సినిమాపై కావాల్సినంత బజ్‌ను సృష్టించింది.
అయితే ఆ బజ్కు సినిమా న్యాయం చెయ్యలేకపోయింది. ప్రియ రూపం, కొన్ని సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెసివ్ ఐస్ మినహా ఆమె పాత్ర ఆకట్టుకోలేకపోయింది. పాత్ర పరంగా ఆమె కంటే ఎక్కువగా నూరిన్ షరీఫ్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. గాథ పాత్రలో నూరిన్ చక్కగా రాణించింది. పాత్ర పరంగా కానీ, అభినయ పరంగా కానీ అందరికంటే ఎక్కువ మార్కులు ఆమెకే.
హీరోగా రోషన్ బాగా చేశాడు. ఆ పాత్రలోని ఘర్షణను తన పరిధిలో బాగానే చూపాడు. ఆ పాత్రను ఇంకా బాంగా తీర్చిదిద్దాల్సింది. రోషన్ స్నేహితులుగా చేసినవాళ్లు బాగానే చేశారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్‌గా చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. నటనపరంగా ఎవరిలోనూ లోపాన్ని పట్టలేం. కానీ ఆసక్తికరం కాని కథలో ఎంత చేసినా వృథానే కదా.
దర్శకత్వం, సంగీతం
దర్శకుడు ఒమర్ లులు టేకింగ్ బాగా అసంతృప్తి కలిగించింది. అతడు కల్పించిన సన్నివేశాల్లో కొన్ని మాత్రమే ఫర్వాలేదనిపించాయి. మిగతావన్నీ నాసిరకంగానో, ఔట్‌డేటెడ్ గానో కనిపించాయి. ఇలాంటి కథతో ఎలాంటి డైరెక్టరైనా చేసేదేమీ ఉండదు. ఈ కథకు కల్పించిన క్లైమాక్స్ మరీ దారుణం. కథ దారి కథదీ, క్లైమాక్స్ దారి క్లైమాక్స్దీ అన్నట్లు.. కథకీ, ముగింపుకీ పొంతన లేదు.
సినిమాలో 9 పాటలున్నాయి. శ్రీదేవికి నివాళిగా స్కూల్ వార్షికోత్సవం రోజు విద్యార్థులు పాడే పాట బాగుంది. అలాగే ఫ్రెండ్షిప్ సాంగ్ కానీ, ఫ్రీక్ పిల్లా సాంగ్ కానీ సంగీత పరంగా బాగున్నాయి. కానీ సాహిత్యమే అతికినట్లుగా లేదు. షాన్ రెహమాన్ సాధ్యమైనంత మంచి సంగీతాన్నివ్వడానికి యత్నించాడు. సినిమాలో ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. అది సంగీతమే.
చివరి మాట
సినిమాల్లో స్కూలు ప్రేమలు, కాలేజీ ప్రేమలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఒకసారి స్కూలనీ, ఇంకోసారి కాలేజీ అనీ మాటల్లో దొర్లిన ఈ స్కూలు (ప్లస్ టూ ఉన్న హయ్యర్ సెకండరీ స్కూలు) ప్రేమకథా చిత్రంలో ప్రేక్షకుల్ని మెప్పించే కథ కానీ, ఆసక్తికర కథనం కానీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘లవర్స్ డే’ అనేది విసుగుతెప్పించే నాసిరకం మూస ప్రేమకథా చిత్రం.