Mahesh To Produce Goodachari Sequel With Adivi Sesh?


Mahesh To Produce Goodachari Sequel With Adivi Sesh?
Mahesh and Adivi Sesh

‘గూఢచారి’ సీక్వెల్‌ని నిర్మించనున్న మహేశ్?

ఒక వైపు సినిమాలు, మరో వైపు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటున్న మహేశ్ అంతటితో ఆగడం లేదు. ఏషియన్ గ్రూప్‌తో కలిసి ‘ఏఎంబీ’ అనే మల్టీప్లెక్స్‌ను కూడా హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఇక ఇదివరకే స్థాపించిన నిర్మాణ సంస్థ జి. మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటేడ్ బేనర్‌పై ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు నిర్మాణ భాగస్వామ్యం వహించాడు.

తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం పూర్తి స్థాయి నిర్మాతగా త్వరలోనే ఒక సినిమాని ప్రారంభించనున్నాడు. అందులో ఆయన కానీ, ఆయన బావ సుధీర్ బాబు కానీ హీరోగా నటించడం లేదు.

‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అడివి శేష్ అందులో హీరోగా నటిస్తాడని వినిపిస్తోంది. కథ కూడా శేష్‌దేనని అంటున్నారు. ‘గూఢచారి’కి సీక్వెల్ చేయబోతున్నట్లు శేష్ ఇదివరకే ప్రకటించాడు. ఇప్పుడు ఆ సినిమాని మహేశ్ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దర్శకుడిగా తొలి సినిమా ‘గూఢచారి’తో పెద్ద హిట్ సాధించిన శశికిరణ్ తిక్క ఈ సినిమానీ డైరెక్ట్ చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వస్తుందని చెప్పుకుంటున్నారు.