Manikarnika Controversy: Kamal Jain Slams Krish


Manikarnika Controversy: Kamal Jain Slams Krish
Manikarnika Controversy: Kamal Jain Slams Krish

క్రిష్‌కు ఆ అర్హత లేదు: ‘మణికర్ణిక’ నిర్మాత

కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణను పొందుతోంది. కంగన నటనకూ ప్రశంసలు అందుతున్నాయి. అయితే సినిమా ప్రారంభానికి ముందు నుంచీ దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 25న సినిమా విడుదలైన తర్వాత దర్శకుడిగా తన పేరు కంటే ముందు కంగన తన పేరు వేసుకోవడంపై క్రిష్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. తన సహ నటుల సన్నివేశాల నిడివిని కంగన మూర్ఖంగా తగ్గించేసిందని కూడా ఆయన ఆరోపించాడు. అంతా తానే కనిపించాలనే స్వార్థంతో కంగన వ్యవహరించిందని చెప్పిన ఆయన, సినిమాలో 70 శాతం కంగన శ్రమ ఫలితమేనని ఆమె సోదరి రంగోలి చెప్పడాన్ని కూడా సవాలు చేశాడు.

తాజాగా ‘మణికర్ణిక’ చిత్ర నిర్మాత కమల్ జైన్ స్పందించాడు. ఈ వివాదంలో క్రిష్‌పై విమర్శలు గుప్పించాడు. అర్హత లేకపోయినా సినిమా క్రెడిట్ కొట్టేయడానికి క్రిష్ ప్రయత్నించడం బాధ కలిగిస్తోందని అన్నాడు. టైటిల్స్‌లో క్రెడిట్స్ అలా రావాలనేది తాను, స్టూడియో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని చెప్పాడు. సినిమాకి ఆద్యంతమూ కంగన అండగా నిలిచిందని ఆయన కితాబిచ్చాడు. ప్రొడక్షన్ టీంకూ, క్రియేటివ్ టీంకూ చెప్పకుండా ఆమె ఏమీ చెయ్యలేదని స్పష్టం చేశాడు. క్రిష్ తాను చెబుతున్నది నిజమే అయితే, తన వాదనని నిరూపించుకోడానికి చట్టపద్ధతిలో ఎందుకు వెళ్లడం లేదని జైన్ నిలదీశాడు. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించడం, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం చూసి ఓర్వలేక క్రిష్ ఆరోపణలు చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు.