NTR Mahanayakudu Release Date: Uncertainty Continues

ఫిబ్రవరి 22, మార్చి 1.. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల ఎప్పుడు?
ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తొలి బాగం ‘కథానాయకుడు’ జనవరి 9న వచ్చింది. అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించిన ఈ చిత్రాన్ని క్రిష్ రూపొందించాడు.
నిజానికి ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తర్వాత మరో వారం పోస్ట్‌పోన్ చేశారు. కానీ తొలి భాగం ఫలితం చూశాక రెండో భాగాన్ని మరింత శ్రద్ధగా మలచాలనే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాల్ని మార్చి, కొన్ని జోడించి వాటిని చిత్రీకరించారు.
రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూ వచ్చారు. దాంతో ఫిబ్రవరి 22న సినిమాని విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.
అయితే ఇప్పటి వరకూ దానికి సంబంధించిన పబ్లిసిటీ మొదలుపెట్టనందున ఈ కొద్ది రోజుల వ్యవధి సరిపోతుందా అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మార్చి 1 అయితే కరెక్టుగా ఉంటుందనీ, పబ్లిసిటీకి కూడా సమయం సరిపోతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
కాగా నందమూరి కల్యాణ్‌రాం సినిమా ‘118’ను మార్చి 1న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కాబట్టి అదే రోజున బాబాయ్, అబ్బాయ్ సినిమాలు రెండూ విడుదలయ్యే అవకాశాలూ తక్కువే.
ఈ నేపథ్యంలో ‘మహానాయకుడు’ విడుదల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా అతి త్వరలోనే ఈ సందిగ్ధతను నిర్మాతలు తొలగించనున్నారు.