Ram Gopal Varma: 30 Years In Industry


Ram Gopal Varma: 30 Years In Industry
Ram Gopal Varma on Shiva sets

రాంగోపాల్ వర్మ: దర్శకుడిగా 30 ఏళ్ల సినీ జీవితం

తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకొనేది ‘శివ’ సినిమానే. 1989లో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమాకు ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌ని పరిచయం చేసింది. అతను.. రాంగోపాల్ వర్మ. అదే ఏడాది ఇదే రోజు (ఫిబ్రవరి 17)న నాగార్జున హీరోగా ‘శివ’ సినిమా షూటింగ్ మొదలైంది. అంటే వర్మ ఇండస్ట్రీకి పరిచయమై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.

తదనంతర కాలంలో ఒక కల్ట్ సినిమాగా గుర్తింపుకు నోచుకున్న ‘శివ’ షూటింగ్‌ను అక్కినేని నాగేశ్వరారరావు కెమెరా స్విచ్చాన్ చేసి ప్రారంభించారు. ఆ పిక్చర్‌ను తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేసిన వర్మ “ఇదే రోజు 30 ఏళ్ల క్రితం.. ‘శివ’ షూటింగ్ ప్రారంభం” అని పోస్ట్ చేశాడు.

ఆ ఫొటోలో అక్కినేనితో పాటు ఉన్న తనను ఉద్దేశించి “ఒక రోడ్‌సైడ్ రోమియోలా ఉన్న నన్ను చూసుకొని నమ్మలేకపోతున్నా. ఈ ఫొటో నా ‘శివ’ రోజుల నాటిది” అని తెలిపాడు. ఫొటోలో అక్కినేనికి కుడివైపు వర్మ ఉండగా, ఎడమ వైపు సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డి ఉన్నారు.

మొదటి సినిమాతోనే దర్శకుడిగా అసాధారణ ఇమేజ్ సంపాదించుకున్న వర్మ.. తదనంతర కాలంలో ఎన్నో టాప్ క్లాస్ సినిమాలు రూపొందించాడు. కానీ రాను రానూ తన ఇమేజ్‌కు భిన్నమైన సినిమాలతో కెరీర్‌లో కిందికి పడిపోయాడు.

ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే వివాదాస్పద చిత్రాన్ని రూపొందించి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించానని ఆయన అంటున్నాడు. వర్మ అంటే గిట్టనివాళ్లు మాత్రం ఇది లక్ష్మీపార్వతి బయోపిక్ అంటున్నారు.