Ranveer Singh Cried Like A Child!

చిన్న పిల్లాడిలా ఏడ్చిన రణ్వీర్ సింగ్
ఎప్పుడూ హుషారుగా, మంచి ఎనర్జీతో కనిపించే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనసులో ఉన్నదాన్ని ఎలాంటి సంకోచాలూ లేకుండా బయటకు చెప్పేసే ఆ కండల వీరుడు చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. తన జీవిత ప్రయాణాన్ని డాన్స్ రూపంలో గౌరవ్ శర్వాణ్, సూపర్ గురు అమర్దీప్ చేసిన ప్రదర్శనని చూసి భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయాడు.
‘గల్లీ బాయ్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం అలియా భట్‌తో కలిసి డాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డాన్సర్ చాప్టర్ 3’ సెట్స్ మీదకు వచ్చాడు రణ్వీర్. షోలో కంటెస్టెంట్లు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్లకు ఫిదా అయిన రణ్వీర్, ప్రత్యేకించి గౌరవ్, అమర్దీప్ చేసిన ప్రదర్శనకు మాత్రం బాగా కదిలిపోయాడు.
జీవితంలో రణ్వీర్ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, విజయాన్ని సాధించి, ఈ రోజున్న స్థితికి ఎలా చేరుకున్నాడో చూపిస్తూ వాళ్లు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది చూశాక తనను తాను నిభాయించుకుకోలేక పోయిన రణ్వీర్ చిన్న పిల్లాడి తరహాలో ఏడ్చేశాడు. కళ్లల్లోంచి నీళ్లు బొటా బొటా కారాయి.
ఆ తర్వాత “నా జీవితాన్ని ఒకరు ఇలా నా కళ్ల ముందే డాన్స్ షోలో ప్రదర్శిస్తారని అస్సలు ఊహించలేదు. మొదట ఆశ్చర్యపోయా. నా హృదయాన్ని మీ ప్రదర్శన బలంగా తాకింది. కాలం మారింది. గత ఏడాది రెండు గొప్ప సినిమాలు చేశాను. పెళ్లి చేసుకున్నా. ఇదంతా కలలా అనిపిస్తోంది. మీరు నన్ను చాలా ఎమోషనల్‌గా మార్చేశారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. ఇది చాలా చాలా టచింగ్‌గా అనిపించింది” అని చెప్పాడు రణ్వీర్.