Reason Behind Why Ajay Devgn Declined Indian 2 Offer


Reason Behind Why Ajay Devgn Declined Indian 2 Offer

‘ఇండియన్ 2’ ఆఫర్‌ను అజయ్ దేవ్‌గణ్ ఎందుకు వద్దనుకున్నాడంటే…

కమల్ హాసన్ టైటిల్ రోల్‌లో శంకర్ రూపొందిస్తోన్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)లో నటించేందుకు వచ్చిన అవకాశాన్ని అజయ్ దేవ్‌గణ్ తిరస్కరించడంతో ఆయన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆ అవకాశాన్ని వద్దనుకోవడం వెనకున్న కారణాన్ని దేవ్‌గణ్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 22న విడుదలవుతున్న తన సినిమా ‘టోటల్ ధమాల్’ ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన ‘ఇండియన్ 2’ ఆఫర్ గురించి నోరు విప్పాడు.

‘ఇండియన్ 2’లో భాగం కావాలని తాను భావించాననీ, కానీ డేట్స్ సర్దుబాటయ్యే అవకాశం కనిపించలేదనీ ఆయన తెలిపాడు. “శంకర్ సినిమాలో చెయ్యాలని నాకెంతగానో ఉంది. కానీ నా దగ్గర డేట్స్ లేవు. ఆయన ఇప్పుడే షూటింగ్ చెయ్యాలన్నాడు. నేను ‘తానాజీ: ద అన్‌సంగ్ వారియర్’ సినిమాకి ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాను” అని చెప్పాడు దేవ్‌గణ్.

విలన్ రోల్ చెయ్యడం ఇష్టం లేకనే ఆ ఆఫర్‌ను ఆయన వద్దనుకున్నాడనే ప్రచారమూ వచ్చింది. దీనిపైనా ఆయన స్పందించాడు. “నేను ‘ఖాకీ’, ‘కంపెనీ’ సినిమాల్లో నెగటివ్ షేడ్స్ రోల్స్ చేశాను. వాటికి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాంటి పాత్రలు మళ్లీ చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ‘ఇండియన్ 2’లో నాకు ఆఫర్ చేసింది నెగటివ్ రోల్ కాబట్టి వద్దనుకున్నాననేది కరెక్ట్ కాదు” అని స్పష్టం చేశాడు అజయ్.