RRR: One Police Station Set & Costumes Of Junior Artistes Leaked!

స్వ్యాతంత్ర్య పూర్వ నేపథ్యంతో ‘ఆర్ఆర్ఆర్’
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది పెద్ద వార్తగా మారిపోతోంది. దేశంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరు, టాలీవుడ్‌లోని ఇద్దరు అగ్ర హీరోల కాంబినేషన్లో ఈ సినిమా తయారవుతుండటం దీనికి కారణం. పైగా ‘బాహుబలి’ సినిమాలతో రాజమౌళి ఖ్యాతి ఖండాతరాలు దాటిందాయె.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సెట్, కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల వేషధారణ బయటకు లీక్ కావడంతో ఈ సినిమా నేపథ్యాన్ని అంచనా వేయడానికి విమర్శకులకు వీలు చిక్కింది. ఇదివరకే ఈ సినిమా కథ 1920ల కాలానికి సంబంధించినదని ప్రచారంలోకి వచ్చింది. కానీ అధికారికంగా అది ధృవీకరణ కాలేదు.
ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్‌తో ఇది స్వాతంత్ర్య పూర్వ కాలపు కథ అనే విషయం స్పష్టమైపోతున్నది. పైగా పోలీస్ స్టేషన్ సెట్ సైతం బిటిష్ కాలం నాటిదని తెలిసిపోతోంది.
ప్రచారంలో ఉన్న దాని ప్రకారం ఇందులో రాంచరణ్ పోలీస్ పాత్రను, జూనియర్ ఎన్టీఆర్ దొంగ పాత్రనూ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
అధికారికంగా వెల్లడి కాకపోయినా చరణ్ జోడీగా అలియా భట్ నటించడం ఖాయమని తెలుస్తోంది. చిన్న ఎన్టీఆర్ సరసన ఎవరు నటించనున్నారనే దానిపైనే ఇంకా క్లారిటీ రాలేదు. సుమారు రూ. 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
