Sai Dharam Tej To Star In Telugu Remake Of Gully Boy?


Sai Dharam Tej To Star In Telugu Remake Of Gully Boy?
Sai Dharam Tej

తెలుగు ‘గల్లీ బాయ్’గా తేజ్?

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జోడీగా జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసిన ‘గల్లీ బాయ్’ ఇటు విమర్శకుల ప్రశంశల్నీ, అటు ప్రేక్షకుల ఆదరణనీ అమితంగా పొందుతూ విజయ పథంలో దూసుకుపోతోంది. తొలి వారాంతానికే దేశంలో 72.45 కోట్ల (నెట్)ను వసూలు చేసి సత్తా చాటింది. ర్యాప్ ఉద్యమం నేపథ్యంలో, గల్లీ నుంచి ఎదిగిన ఒక ర్యాపర్ కథతో రూపొందిన ఈ సినిమాని హాలీవుడ్ అగ్ర నటుడు విల్ స్మిత్ సైతం ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో పునర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘గల్లీ బాయ్’ తెలుగు హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. రణ్‌వీర్ చేసిన మురాద్ అహ్మద్ పాత్రను తెలుగులో సాయిధరం తేజ్‌తో చేయించాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం తేజ్ కెరీర్ చిక్కుల్లో ఉన్న విషయం తెలిసిందే. వరుసగా 6 ఫ్లాపులతో క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏప్రిల్‌లో రానున్న ‘చిత్రలహరి’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. దాని ఫలితం ఎలా ఉన్నా తేజ్‌కు లిఫ్ట్ ఇవ్వాలని మెగా ఫ్యామిలీ అంతా కృషి చేస్తోంది. ‘గల్లీ బాయ్’ సినిమా అతడికి కచ్చితంగా విజయాన్ని అందిస్తుందని అరవింద్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కావచ్చు.

Sai Dharam Tej To Star In Telugu Remake Of Gully Boy?
A still from Gully Boy