కశ్మీరీలపై వేధింపులను అడ్డుకోండి: సుప్రీం కోర్టు


కశ్మీరీలపై వేధింపులను అడ్డుకోండి: సుప్రీం కోర్టు
ఢిల్లీలో ఒక కశ్మీరీ యువకుడిపై సామూహిక దాడి చేస్తున్న గుంపు

పుల్వామా బాంబు దాడి అనంతరం కశ్మీరీలపై జరుగుతున్న హింస, బెదిరింపులు, సామాజిక బహిష్కరణల వంటి ఘటనలను అడ్డుకోవడానికి ‘తగిన’, ‘అవసరమైన’ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలను శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న ఫిబ్రవరి 14 ఘటన అనంతరం కశ్మీరీలపై బెదిరింపులు, హింస చోటు చేసుకున్న 11 రాష్ట్రాలనూ, కేంద్రాన్నీ వివరణ కోరింది.

“ఫిబ్రవరి 14 ఉగ్ర దాడి నేపథ్యంలో విధ్యార్థులు సహా కశ్మీరీలపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులు, సామాజిక బహిష్కారం, ఇతర అసాధారణ చర్యలను నిరోధించడానికి తగిన, అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలనూ, డీజీపీలనూ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌నూ ఆదేశిస్తున్నాం” అని చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం కోర్ట్ బెంచ్ చెప్పింది.

పుల్వామా దాడి తర్వాత దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తారిఖ్ అదీబ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

ఆ వేధింపులను అడ్డుకొనే విధంగా అధికారులను ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిపై వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అందుకు అనుగుణమైన ఆదేశాలనిచ్చింది.