వైమానిక దళ దాడిలో 200 మంది ఫిదాయీలు హతం!


వైమానిక దళ దాడిలో 200 మంది ఫిదాయీలు హతం!
వైమానిక దళం దాడి చేసిన ప్రాంతం

పాకిస్తాన్‌లోని సరిహద్దు వెంబడి ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిందని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే ధ్రువీకరించారు. మంగళవారం తెల్లవారుఝామున జరిగిన ఈ దాడిలో 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయనీ, అవి 1000 కిలోల బాంబులను ఆ శిబిరంపై జారవిడిచాయనీ ఆయన చెప్పారు.

పాకిస్తాన్‌లోని మన్సేరా జిల్లాలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని జైషే శిబిరాలనే వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని గోఖలే స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రధాన దాడి జరిగిన ప్రదేశం మన్సేరా జిల్లాలోని జబా టాప్ (జబ్బా టాప్ అని కూడా అంటారు) అని ఖాయమైంది.

ఐఏఎఫ్ ఆపరేషన్ జరిగిన సమయంలో జైషే శిబిరంలో కనీసం 200 మంది ఫిదాయీలు ఉన్నారనీ, వీరంతా దాడిలో చనిపోయి ఉంటారనీ ప్రాథమిక సమాచారం.

రక్షణ శాఖ వర్గాల ప్రకారం, ఐఏఎఫ్ యుద్ధ విమానాలు కేవలం జైషే శిబిరాలనే కాకుండా, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ శిబిరాలు నియంత్రణ రేఖ, జబా టాప్ మధ్య ముజఫరాబాద్ సమీపంలో ఉన్నాయి. చకొఠి, బాలాకోట్, ముజఫరాబాద్ సహా ఆరు ప్రదేశాల్ని ఐఏఎఫ్ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది.