Sye Raa Narasimha Reddy: Will The Chiranjeevi Starrer Be Released In Dasara Season?


Sye Raa Narasimha Reddy: Will The Chiranjeevi Starrer Be Released In Dasara Season?

‘సైరా’ దసరాకి వచ్చేనా?

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం ఈ ఏడాది విజయదశమికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా?.. ఈ ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కొంత కాలంగా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారమూ వెల్లడి కాకపోవడమే దీనికి కారణం.

రాయలసీమకు చెందిన తొలినాటి స్వాతంత్ర్యసమర యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తయారవుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. షూటింగ్ మొదలై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. 2017 డిసెంబర్‌లో షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

కొంత కాలం క్రితం సురేందర్ రెడ్డి పనితనంపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రచారాన్ని యూనిట్ ఖండించింది. సినిమాలోని ప్రధాన పాత్రధారుల లుక్స్ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. షూటింగ్ ఎంతవరకు వచ్చిందనే విషయం మాత్రం బహిర్గతం కాలేదు.

సినిమా దసరాకి రావాలంటే ఈ సరికి షూటింగ్ చివరి దశకు వచ్చేయాలి. ఎందుకంటే సీజీ వర్క్ చాలానే ఉంది. యుద్ధ సన్నివేశాలతో పాటు అనేక ఇతర సన్నివేశాలకు కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. మార్చి నాటికి షూటింగ్ పూర్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఉంటుందని చిరంజీవి బృందం భావిస్తోంది.

‘వినయ విధేయ రామ’ సినిమా విడుదల తర్వాత రాంచరణ్ ఎక్కడా కనిపించలేదు. ‘సైరా’ నిర్మాణ పనుల్లో బిజీ అయ్యాడని తెలుస్తోంది. ‘సైరా’ విడుదల విషయంలో నెలకొంటున్న అపోహలు తొలగాలంటే సినిమా ప్రోగ్రెస్ గురించి చరణ్ మాట్లాడాలి.

అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, హుమా ఖురేషి, నాజర్, రవికిషన్, ముఖేశ్ రుషి కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నాడు.