The One Hero Tollywood Need To Push In 2019


The One Hero Tollywood Need To Push In 2019
Sai Dharam Tej

2019లో టాలీవుడ్ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్న హీరో!

వరుసగా మూడు సినిమాలు ఫెయిలవడం ఒక మామూలు స్టార్ మార్కెట్‌ను కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అతని మార్కెట్ విలువను పడిపోయేలా చేస్తుంది. అదే వరుసగా 6 సినిమాలు ఫెయిలైతే? ఆ హీరో పరిస్థితిని అంచనా వెయ్యడం కష్టం. అలాంటి బాధాకర పరిస్థితి ఎదురైన హీరో సాయిధరమ్ తేజ్. అనిల్ రావిపూడి రూపొందించిన ‘సుప్రీమ్’ తేజ్ చివరి హిట్ ఫిల్మ్.

దాని తర్వాత అతను సునీల్‌రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘తిక్క’, గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేసిన ‘విన్నర్’, కృష్ణవంశీతో చేసిన ‘నక్షత్రం’, బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన ‘జవాన్’ సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. ఇలాంటి కష్ట కాలంలో 2018లో ఇద్దరు సీనియర్ డైరెక్టర్లతో కలిసి పనిచేశాడు తేజ్. వారిలో ఒకరు మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన వీవీ వినాయక్ అయితే, మరొకరు లవ్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరుపొందిన ఎ. కరుణాకరన్.

కానీ వినాయక్‌తో చేసిన ‘ఇంటిలిజెంట్’, కరుణాకరన్ డైరెక్షన్‌లో నటించిన ‘తేజ్.. ఐ లవ్ యు’ సినిమాలు రెండూ ఒక దాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. తద్వారా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా సో బ్యాడ్ రికార్డ్ మూటగట్టుకున్నాడు తేజ్.

ఇప్పుడు తేజ్ ఆశలన్నీ ‘చిత్రలహరి’ సినిమా పైనే ఉన్నాయి. రాంతో ‘నేను శైలజ’ వంటి హిట్ సినిమా తీసిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. అంతేనా! ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తాగ్యారేజ్‌’, ‘రంగ‌స్థ‌లం’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘హలో’ ఫేమ్ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, ‘మెంటల్ మదిలో’ ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇన్ని హంగులు, ఆకర్షణలు ఉండటం వల్ల ఈ సినిమాపై చాలామందిలో ఒక నమ్మకం కలుగుతోంది.

అయితే ‘చిత్రలహరి’ అనే టైటిల్ మరీ సాఫ్ట్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేటి యువత ఆ టైటిల్‌కు ఎలా కనెక్టవుతారని ప్రశ్నిస్తున్న వాళ్లు ఎక్కువమందే ఉన్నారు. సినిమాలోని ఐదు పాత్రలను టైటిల్‌లోని ఐదక్షరాలు సూచిస్తాయని తేజ్ చెప్పాడు. పాత్రలకు సంబంధం ఉన్న టైటిల్ కాబట్టి సినిమా చూసినవాళ్లు టైటిల్‌కు బాగా కనెక్టవుతారని భావిస్తున్నారు.

వరుస ఆరు ఫెయిల్యూర్స్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ్‌ను టాలీవుడ్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.