‘వెంకీ మామ’లో చైతూ సరసన రాశి


'వెంకీ మామ'లో చైతూ సరసన రాశి
Raashi Khanna

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ‘వెంకీ మామ’లో నాగచైతన్య జోడీగా అందాల తార రాశీ ఖన్నా వచ్చింది. వెంకటేశ్ జోడీగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్‌పుత్ ఇదివరకే ఎన్నికైన విషయం తెలిసిందే. మొత్తానికి హీరోల సరసన మొదట ఎంపికైన ఇద్దరు తారలూ మారిపోయి, వారి స్థానాల్లో వేరే తారలు రావడం గమనార్హం.

ముందు చైతూ జోడీగా రకుల్‌ప్రీత్ ఎంపికవగా, తర్వాత వెంకీ జోడీగా శ్రియను ఎంపిక చేశారు. తర్వాత శ్రియ స్థానంలోకి పాయల్ వచ్చింది. ఆపైన ఏమైందో ఏమో.. రకుల్‌ప్రీత్‌ను తొలగించారు. తర్వాత నభా నటేశ్ పేరు వినిపించినా, చివరకు రాశీని ఖాయం చేశారు. సందర్భవశాత్తూ రకుల్, రాశీ మంచి స్నేహితులు.

చైతూతో రాశికి ఇదే తొలి సినిమా. ‘వెంకీ మామ’ బృందంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ, బాబీ డైరెక్షన్‌లో రెండోసారి నటిస్తుండటం సంతోషంగా ఉందనీ తెలిపింది రాశి. ఇదివరకు బాబీ రూపొందించిన ‘జై లవకుశ’లో రాశి నటించింది.

ఈ రోజే రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్‌తో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.