Why Rudraraju Sagar Is The Best Protagonist Of The Generation?

నేటి తరం అసలైన హీరో రుద్రరాజు సాగర్!
తెలుగులో కథకులు, దర్శకులు ఎన్నో పాత్రలను సృష్టిస్తుంటారు. మనవి ఎక్కువగా కమర్షియల్ సినిమాలే కాబట్టి హీరో పాత్రల్లో వాస్తవికత కంటే నాటకీయతే ఎక్కువగా ఉంటుంది. లార్జర్ దేన్ లైఫ్ టైపులోనే కనిపిస్తుంటాయి. చాలా తక్కువ సంఖ్యలోనే పాత్రలు రియాలిటీకి దగ్గరగా కనిపిస్తుంటాయి. అలా కనిపించిన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం తక్కువ.
అయితే వేణు ఊడుగుల అనే కొత్త దర్శకుడు తీసిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా చూస్తే ప్రధాన పాత్రను అతను మలచిన విధానం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్నీ కలిగిస్తుంది. ఇవాళ అనేకానేక మధ్యతరగతి ఇళ్లల్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యను ఎంత బాగా, కొట్టినట్లుగా సూటిగా, అదే సమయంలో విసుగెత్తించకుండా చూపించాడు!.. అనిపించక మానదు.

‘నీదీ నాదీ ఒకే కథ’ అనేది రుద్రరాజు సాగర్ అనే కుర్రాడి కథ. తండ్రి ఉపాధ్యాయుడైనా సాగర్ చదువులో మొద్దు. పరీక్షల్లో ఫెయిలవుతూ డిగ్రీ పూర్తి చెయ్యడానికి తంటాలు పడుతుంటాడు. తనకు చదువబ్బదని అతనికి తెలుసు. అందుకే మేకానిక్కో, కారు డ్రైవరో అవుదామనుకుంటాడు. అంతకంటే అతడికి పెద్ద ఆశలుండవు.
కానీ తండ్రి అందుకు విరుద్ధంగా అతడిని గొప్ప ఉద్యోగంలో చూడాలని కోరుకుంటూ ఉంటాడు. కొడుకుపై ఒత్తిడి తెస్తూ ఉంటాడు. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని బాధపడుతూ ఉంటాడు. తండ్రిని మెప్పించడానికి పరీక్షల్లో పాసవ్వాలనుకుంటాడు సాగర్. కానీ విఫలమవుతాడు.

జీవితంలో (ఉన్నత స్థాయిలో) సెటిల్ అవడమే అంశం చుట్టూ కథను అల్లి, ఆ కథలో సాగర్ పాత్రని సృష్టించి వదిలాడు దర్శకుడు వేణు. చిత్తూరు యాసలో సాగర్ (శ్రీవిష్ణు) మాట్లాడుతుంటే, తన ఆలోచనల్ని అమాయకంగా, నిష్కల్మషంగా చెబుతుంటే మనం ఆ అమాయకుడ్ని ప్రేమించకుండా ఉండలేం.
జీవితమంటే లక్ష్యాలేనా? ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛంగా, మనసుకు నచ్చినట్లు బతక్కూడదా?.. అని అడుగుతుంటే కాదని ఎలా అనగలం. పెద్దలు తమ కోరికల్నీ, అభిరుచుల్నీ పిల్లల మీద రుద్ది, పసితనం నుంచే వాళ్లని మర మనుషులుగా తయారు చేయడమేనా జీవితానికి అర్థమని సాగర్ పాత్ర వేసే ప్రశ్నకు నిజాయితీతో సమాధానం ఇవ్వగలిగేదెవ్వరు?

విజయానికి ఐదు మెట్లు, ఆరు మెట్లు, జీవితంలో విజయం సాధించడం ఎలా? అంటూ వ్యక్తిత్వ వికాసం పేరుతో వచ్చే పుస్తకాలు చెప్పేదేమిటి? ఆ పుస్తకాల్లో ఉండేది జీవితమా? లేక సక్సెస్ పేరుతో ఒకరితో ఒకరు పోటీపడుతూ, ఆ పోటీలో ఒకర్నొకరు వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నించడమా? సమాజం కోరుకున్నట్లు ముసుగు వేసుకొని బతకడం సాగర్‌కు రాదు. అతను తనకు నచ్చినట్లు, తనకు అనిపించినట్లు ఉండాలనుకొనే ఒక స్వచ్ఛమైన మనిషి. ప్రకృతి ప్రకారం నడుచుకొనే మనిషి.
నిజానికి ఇవాళ్ల ఇతరులకు హాని కలిగించకుండా హాయిగా తమకు నచ్చిన దారిలో బతకాలనుకొనే ఒక మనసున్న యువకులే సమాజానికి కావాలి. అప్పుడు కుళ్లు లేని, ఒత్తిళ్లు లేని సమాజం ఆవిష్కారమవుతుంది. నేటి తరానికి నిఖార్సయిన ప్రతినిధి రుద్రరాజు సాగర్. నిజానికి సాగర్ అసలుసిసలు హీరో. అలాంటి హీరోలతో నిండిన సమాజం ఎంత బాగుంటుంది! ఎంత ఆనందమయంగా ఉంటుంది!!
