‘118’ రివ్యూ: మూడడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి


'118' రివ్యూ: మూడడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను, హరితేజ, శ్రావణ్, రాజీవ్ కనకాల, భరత్‌రెడ్డి

దర్శకత్వం: కె.వి. గుహన్

విడుదల తేది: 1 మార్చి, 2019

సినిమాటోగ్రాఫర్‌గా పలు పేరుపొందిన చిత్రాలకు పనిచేసిన కె.వి. గుహన్ తెలుగులో తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా మనముందుకొచ్చింది. ట్రైలర్ విడుదలైనప్పట్నుంచీ ‘118’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాపైనా, ప్రధాన పాత్రధారులపైనా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రశంసలు సినిమాపై మరింత నమ్మకాన్ని కలిగించాయి. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే…

కథాంశం

ఒక టీవీ చానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేసే గౌతమ్ (కల్యాణ్‌రామ్)కు ఒక రిసార్ట్‌లోని రూంలో పడుకున్నప్పుడు ఒక కల వస్తుంది. అందులో ఒక యువతిని ఎవరో దారుణంగా కొట్టినట్లు, ఒక కారును కొండ మీద నుంచి కింద నీళ్లలోకి పడేసినట్లూ కనిపిస్తుంది. ఆర్నెల్ల తర్వాత అదే రూంలో పడుకునప్పుడు కూడా అదే కల మళ్లీ వస్తుంది.

రెండు సందర్భాల్లోనూ సమయం రాత్రి 1.18 గంటలని చూపిస్తుంది. పైగా ఆ రూం నంబర్ 118. అది యాదృచ్ఛికంగా వచ్చిన కల కాదని అనుమానించిన గౌతమ్, తన ఫియాన్సీ మేఘ (షాలినీ పాండే), ఆఫీసులో తను ‘మామా’ అని పిలిచే కొలీగ్ (ప్రభాస్ శ్రీను) సహకారంతో ఆ కలలోని విషయాల్ని అన్వేషిస్తూ వెళ్తాడు. ఈ క్రమంలో ఆ కల ఒక భయంకర వాస్తవ ఉదంతానికి సంబంధించినదనే విషయం తెలుస్తుంది.

తనకు కలలో వచ్చిన యువతి పేరు ఆద్య (నివేదా థామస్) అనే సంగతి తెలుసుకున్నాక గౌతంకు వరుసగా ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అతడికి సాయపడాలనుకొనేవాళ్లు ఒక్కొక్కరుగా అంతమైపోతూ ఉంటారు. అసలు ఆద్య ఎవరు? తన కల వెనుక రహస్యాన్ని గౌతమ్ ఛేదించాడా?.. అనేది మిగతా కథ.

కథనం

ఒక మెడికల్ క్రైంకు సంబంధించిన అంశాన్ని కలకు ముడిపెట్టి, ఆ కల ద్వారా హీరో ఒక భయంకర రహస్యాన్ని ఛేదించాడని దర్శకుడు ‘118’లో చూపించాడు. కలగా వచ్చింది నిజంగా జరిగిందని ప్రేక్షకులు నమ్మడం కోసం మెడికల్ అంశాల్ని ఉపయోగించుకున్నాడు.

అయితే కలలో సూచనప్రాయంగా వచ్చిన ఉదంతం మొత్తం తెలుసుకోవాలంటే తానే కలలోకి వెళ్లి అప్పుడు జరిగిన ఒక దారుణాన్ని తన కళ్లతో చూడ్డమనే విషయం నిజంగా సాధ్యపడుతుందా? అనేది ఎవరికైనా వచ్చే సందేహం. దాన్ని క్లినికల్ టెర్మినాలజీ ప్రకారం వివరించాలనుకున్నా ప్రేక్షకుడు నమ్మడం కష్టమే.

ఫస్టాఫ్‌లో గౌతంను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలతో దర్శకుడు కథనాన్ని సాఫీగానే నడిపించాడు. తనకు రెండుసార్లు వచ్చిన కల వెనుక ఏదో రహస్యం ఉందని పసిగట్టిన గౌతమ్, దాన్ని ఛేదించడం కోసం ప్రయత్నించడంతో కథనంలో సహజంగానే ఆసక్తి పెరిగింది. కలలో వచ్చిన ప్రదేశాన్ని కూడా అతడు తెలుసుకోవడం సరైన ఇంటర్వెల్ పాయింటే.

గౌతమ్ కలలో కనిపించడం తప్ప ఆద్య పాత్ర ఫస్టాఫ్‌లో ఎక్కడా కనిపించదు. సెకండాఫ్ కొంత గడిచాక ఆద్య కథను గౌతంకు ఆమె స్నేహితురాలు ఎస్థర్ (హరితేజ) చెబుతుంది. అప్పుడే మనకు ఆద్య ఎవరనే విషయం తెలుస్తుంది. ఆమెకి కూడా ఆద్య ఏమైందనే విషయం తెలీదు.

దాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్ (నాజర్) సాయంతో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోడానికి మూడోసారి కలను రప్పించుకున్న గౌతమ్, కలలోనే ఆ ఘటన జరిగిన చోటుకు వెళ్లడం, రహస్యాన్ని ఛేదించడం అనే పాయింట్ కొత్తగా, వైవిధ్యంగా ఉంది. ఇలా ఒక మనిషి తనకొచ్చిన కలలోకి వెళ్లడమనేది సాధ్యమేనని డాక్టర్ చేత చెప్పించడం సాధారణ ప్రేక్షకుడిని ఎంతవరకు కన్విన్స్ చేస్తుందనేది పెద్ద ప్రశ్న.

ఒక కార్పొరేట్ ఫార్మా కంపెనీ తన బిజినెస్ కోసం పసిపిల్లలపై వాక్సిన్ రూపంలో విషాన్నివ్వడం, వాళ్లు చనిపోవడం, దాని వెనకున్న కుంభకోణం విషయం కూడా మెడికల్ భాష తెలిసిన వాళ్లకు అర్థమవుతుంది కానీ, సగటు ప్రేక్షకుడికి తికమక వ్యవహారమే. ‘118’ సినిమా జయాపజయాల్ని ఈ అంశాలే ప్రభావితం చేయనున్నాయ్.

'118' రివ్యూ: మూడడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి
తారల అభినయం

గౌతంగా కల్యాణ్‌రాం ‘ద బెస్ట్’ పర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నమ్మేట్లు నటించాడు. విధి నిర్వహణలో ఉండాల్సిన నిబద్ధతతని ప్రదర్శించాడు. మేఘ సమక్షంలో ఎంత హుషారుగా కనిపించాడో, క్లైమాక్స్‌లో హృదయాన్ని పిండేసే సన్నివేశంలో అంత పరిణతినీ చూపాడు. అతని డైలాగ్ డిక్షన్‌లోనూ మార్పు స్పష్టంగా కనిపించింది. జయాపజయాలు పక్కనపెడితే ఈ సినిమాలో నటుడిగా మరింత ఎదిగాడని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.

గౌతంకు సపోర్టుగా నిల్చొనే మేఘ పాత్రలో షాలినీ పాండే ఒదిగిపోయింది. ‘అర్జున్‌రెడ్డి’లోని ప్రీతి పాత్రతో పోలిస్తే, ఇందులో పూర్తి భిన్నమైన పాత్రలో ఆమె కనిపిస్తుంది. అయితే మేఘ పాత్ర తీరు వల్ల ఆమెకు నటించడానికి ఎక్కువ అవకాశం దక్కలేదు. జస్ట్.. మేఘగా రాణించిందంతే.

సినిమాలో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకొనేది.. నిస్సందేహంగా నివేదా థామస్. నిడివి దృష్ట్యా చూసినప్పుడు తక్కువగా అనిపించినా ఆద్య పాత్ర మన హృదయాల్ని తాకడానికి కారణం, ఆ పాత్ర చిత్రణ, ఆ పాత్రలో నివేదా ప్రదర్శించిన అభినయం. ఆ పాత్రను ముగిసిన తీరు గుండెల్ని కలచివేస్తుంది. ఆమెనలా చూపించినందుకు దర్శకుడిపై మనకు కోపమూ వస్తుంది.

గౌతమ్ కొలీగ్‌గా పూర్తి స్థాయి పాత్రలో ప్రభాస్ శ్రీను ఓకే. అతడి పాత్రను ఇంకొంత వినోదాత్మకంగా మలిస్తే బాగుండేది. సాధారణంగా అతడి నుంచి హాస్యాన్నే ఎవరైనా ఆశిస్తారు. ఆ కోణం మిస్సయింది. చమ్మక్ చంద్ర పాత్ర విషయంలోనూ అదే జరిగింది. చంద్ర పాత్రను దర్శకు డు సరిగా ఉపయోగపెట్టుకోలేదు.

రాజీవ్ కనకాలకూ కథలో తగినంత ప్రాముఖ్యం లభించలేదు. హరితేజ, శ్రావణ్ తమ పాత్ర పరిధుల్లో మెప్పించారు. మెయిన్ విలన్‌గా కనిపించిన నటుడు ఆ పాత్రకు సరిపోయాడు.

దర్శకత్వం, సంగీతం

ఇదివరకు తెలుగు ‘హ్యాపీ డేస్’ సినిమాని తమిళంలో ‘ఇనిదు ఇనిదు’ (2010) పేరుతో రీమేక్ చేయడం ద్వారా డైరెక్టర్‌గా మారిన సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్, ఇన్నేళ్ల తర్వాత తెలుగులో దర్శకుడిగా తన తొలి చిత్రం, మొత్తంగా రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మిగతా జోనర్లతో పోలిస్తే థ్రిల్లర్‌ను రూపొందించడం సామాన్య విషయం కాదు. అయినా శాయశక్తులా ఆసక్తికరంగా మలచడానికి కృషి చేశాడు. టేకింగ్ బాగానే ఉంది. అయితే ఎంచుకున్న సమస్యను సగటు ప్రేక్షకుడ్ని కూడా మెప్పించేలా చిత్రీకరించడంలో తికమకకు గురయ్యాడు. ఫలితంగా సెకండాఫ్ దెబ్బకొట్టేసింది.

మెడికల్ అంశాలను డీల్ చేసేప్పుడు ఆసక్తికరంగా ఉండాలే కానీ, ఆ అంశాలు క్లిష్టంగా కనిపించకూడదు. అవి క్లిష్టంగా మారితే కథనంలో టెంపో తగ్గిపోతుంది. ‘118’లో కనిపించిన ప్రధాన లోపం అదే. అలాగే కొన్ని పాత్రల్ని సరిగా మలచలేకపోయాడు దర్శకుడు. క్లైమాక్స్ సన్నివేశం హృదయాల్ని పిండేసినా, ప్రేక్షకులు ప్రేమించే ఒక పాత్ర ముగింపును దృశ్యమానం చేసిన తీరు భీతి కలిగిస్తుంది. సినిమాకి అదొక మైనస్ పాయింట్.

‘118’కు ప్లస్సయిన అంశాల్లో శేఖర్ చంద్ర మ్యూజిక్ తప్పకుండా ఉంటుంది. సన్నివేశాలకు అతడిచ్చిన నేపథ్య సంగీతం ఒక క్లాసిక్ థ్రిల్లర్ తరహాలో ఉంది. సన్నివేశాల్లోని మూడ్‌ను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. మొదటి పాట ‘చందమామే’ స్వరాలు ఆకట్టుకున్నాయి.

ఇంతటి ప్రతిభావంతుడికి పెద్ద సినిమాల దర్శకులు, హీరోలు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదో అర్థం కాని విషయం.

చివరి మాట

థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకే ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులనందర్నీ మెప్పించడం కష్టం.

– బుద్ధి యజ్ఞమూర్తి