1st Rank Raju Teaser Decoded: Raju Character Analysed & Decoded

1st Rank Raju Teaser Decoded: Raju Character Analysed & Decoded
పుస్తకాలు.. అదీ చదువుకు సంబంధించిన.. అందులోనూ సిలబస్‌లో ఉన్న పాఠాల్ని మాత్రమే బుర్రలో ఉంచుకొని, మిగతావాటినేవీ బుర్రలో పెట్టుకోవద్దంటూ ఒక తండ్రి కొడుకును పెంచితే ఆ కొడుకు ఎలా తయారవుతాడో వినోదాత్మకంగా చూపించిన సినిమా ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’.
ఆ తండ్రిగా సీనియర్ నరేశ్, కొడుకుగా చేతన్ మద్దినేని నటించారు. ‘విద్య 100%.. బుద్ధి 0%’ అనేది ఉపశీర్షిక. అంటే చదువులో నంబర్‌వన్‌గా ఉన్నవాడు లోకజ్ఞానం విషయంలో జీరో అన్నమాట. కన్నడంలో 2015లో ఇదే పేరుతో వచ్చి ఘన విజయం సాధించిన సినిమాకు ఇది రీమేక్. కన్నడ ఒరిజినల్ దర్శక నిర్మాతలే తెలుగులోనూ ఈ సినిమాని తీయడం గమనార్హం.
100 సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో హీరో తాను నవ్వకుండా, తన అమాయకత్వంతో ప్రేక్షకుల్ని ఎంతగా నవ్విస్తాడో అర్థమవుతుంది.
తండ్రి నీళ్లల్లో పువ్వుల్ని పెడుతుంటే స్కూలు కుర్రాడిగా ఉన్న మన హీరో “నాన్నా.. ఎందుకు వాటర్‌లో ఫ్లవర్స్ పడేస్తున్నావ్?” అనడుగుతాడు.
తండ్రి (నరేశ్) “రేయ్.. ఇది సిలబస్‌లో ఉందా?” అని ఎదురు ప్రశ్నిస్తాడు.
రాజు “లేదు నాన్నా” అంటాడు.
తండ్రి “సిలబస్‌లో లేంది బ్రైన్లో పెట్టుకొని బుర్ర పాడుచేసుకోవద్దు. అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వస్తావ్” అంటాడు (బ్రైన్, బుర్ర రెండూ ఒకటే అని తండ్రికి కూడా తెలీదన్న మాట).
“బుక్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ద్యాన్..” అని తండ్రి అడిగితే, “జనరల్ నాలెడ్జ్” అని జవాబిస్తాడు రాజు.
తండ్రి అలా పెంచిన రాజు పెద్దవాడై, స్కూలు స్టూడెంట్ నుంచి కాలేజీ స్టూడెంట్ అవుతాడు.

కూరగాయల దుకాణానికెళ్లి “టమోటా ఎంత?” అనడుగుతాడు. షాపతను “20 రూపాయలు” అని చెప్తాడు. “ఒక్కోటి ఇరవయ్యా?” అని రాజు ఆశ్చర్యపోతాడు. ఇది విని ఆశ్చర్యపోయిన షాపువాడు “ఫస్ట్ ర్యాంకా!” అంటాడు.
ఇదే మాట మరొకతను కూడా అడిగితే “నీక్కూడా ఎలా తెలిసిపోయింది?” అని అమాయకంగా అడుగుతాడు రాజు. అతను “కింద టమాటాలు, పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది” అంటాడు.
ప్రిన్సిపాల్ పద్మనాభం (పోసాని కృష్ణమురళి) రూంలోంచి ఫోన్ చేసి “మేడం మీరు రేపు 7 పీఎం తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి” అంటాడు అమాయకంగా. అది విని సీట్లోంచి ఎగిరి పడతాడు ప్రిన్సిపాల్.
“ఇంతకీ మావాడి ప్రాబ్లెం ఏంటి?” అని బ్రహ్మానందాన్ని రాజు తల్లి అడుగుతుంది.
బ్రహ్మానందం ఒకవైపు బాగా ఫ్రస్ట్రేషన్ ఫీలవుతూ, ఏడుపు గొంతుతో “ఏం చెప్పమంటారండీ ప్రాబ్లెం? వాడు టీ షర్ట్ వేసుకున్న టెక్స్ట్‌బుక్‌లా ఉన్నాడండీ. నిక్కరేసుకున్న నోట్‌బుక్‌లా ఉన్నాడండీ” అని చెప్పి, నరేశ్‌తో “కన్నబిడ్డను పెంచే పద్ధతి ఇదేనాండీ” అంటాడు.
సినిమా చూడ్డానికి హీరోయిన్‌తో పాటు థియేటర్‌కు వెళ్తాడు రాజు. అక్కడ హీరోయిన్ టికెట్ కౌంటర్లో ఉన్నతనితో “టూ కార్నర్ సీట్స్” అనడుగుతుంది. వెనకే ఉన్న రాజు “కార్నర్ సీట్సెందుకు? ఫ్రంట్ కూర్చుందాం. సినిమా బాగా కనిపిస్తుంది” అని పెద్దగా అంటాడు ఎప్పటికి మల్లే అమాయకంగా.
అక్కడున్న జనమంతా ఆశ్చర్యంగా అతడివంకే చూస్తారు. రాజు వెనుక క్యూలో నిల్చున్న పెద్దాయన నవ్వుతా “ఏమ్మ్మా ఫస్ట్ టైమా?” అనడుగుతాడు. రాజు “ఆ.. ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా” అంటాడు. ఇదీ రాజు కేరెక్టరైజేషన్!

టీజరే ఇంత నవ్వించిందంటే సినిమా ఇంకెంత నవ్విస్తుందో ఊహించుకోవాల్సిందే. ఇలా నవ్వించడంతో పాటు పిల్లల్ని చదువే లోకంలా పెంచితే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో కూడా ఈ సినిమా చెబుతుంది.
కాశిష్ వోరా నాయికగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.
నరేశ్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై మంజునాథ్ వి. కందుకూర్ నిర్మించారు.
– సజ్జా వరుణ్
1st Rank Raju Teaser Decoded: Raju Character Analysed & Decoded | actioncutok.com
You may also like: