అర్జున్ సురవరం: టీజర్ చెబుతున్న 8 విషయాలు


అర్జున్ సురవరం: టీజర్ చెబుతున్న 8 విషయాలు

నిఖిల్ టైటిల్ రోల్ చేసిన ‘అర్జున్ సురవరం’ సినిమా టీజర్ మహాశివరాత్రి సందర్భంగా సోమవారం సాయంత్రం విడుదలైంది. టి. సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లావణ్యా త్రిపాఠి నాయిక.

టీజర్ మొదట్లో “ఒక అబద్ధాన్ని నిజం చెయ్యడం చాలా ఈజీ. కానీ ఒక నిజాన్ని నిజం అని ప్రూవ్ చెయ్యడం చాలా కష్టం. నా పేరు అర్జున్ లెనిన్ సురవరం. జనాలకు నిజం చెప్పడమే నా ప్రొఫెషన్” అంటూ తనని తాను అర్జున్ పరిచయం చేసుకుంటాడు. ఆ వెంటనే ‘అర్జున్‌ని అరెస్ట్ చెయ్యాలి’, ‘అర్జున్‌ని ఉరి తీయాలి’, ‘సమాజానికి పట్టిన చీడపురుగు అర్జున్’ అనే ప్లకార్డులతో జనం నిరసనం చేయడం కనిపిస్తుంది.

దాన్ని బట్టి టీవీ99 రిపోర్టర్ అయిన అర్జున్ ఏదో పెద్ద సమస్యలో చిక్కుకున్నాడని అర్థమవుతోంది. అతడు చేసిన ఒక పనివల్ల అతడిని అపార్థం చేసుకొని వాళ్లు అలా నిరసనలకు దిగైనా ఉండాలి, లేదా, అతడిని కావాలని ఎవరో ఏ నేరంలోనో ఇరికించి నేరగాడిలా జనంచేత నమ్మించైనా ఉండాలనిపిస్తుంది.

“వెతికేవాడు దొరకట్లేదు, వెతకాల్సినవాడు తెలియట్లేదు. దీనికి సమాధానం ఒకే ఒక్కడు” అని అర్జున్ మధనపడటం చూస్తే, ఒక ఘటన గురించి అతడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడనీ, ఆ ఒక్కడిని పట్టుకోడానికి కష్టపడుతున్నాడనీ తెలుస్తోంది.

ఒక ఆఫీస్ ఫైళ్లున్న గదికి ‘పోలీస్ లైన్ డు నాట్ క్రాస్’ అనే టేప్స్ ఉండడాన్ని బట్టి, ఆ ప్లేస్‌లోనే జరగకూడని ఘటనేదో జరిగిందన్న మాట. ఒకసారి అక్కడకు వచ్చిన అర్జున్‌పై ఎవరో దాడి చేస్తే, అక్కడి నుంచి అతడు ఎస్కేప్ అవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది.

అర్జున్ సురవరం: టీజర్ చెబుతున్న 8 విషయాలు

ఒక సీన్‌లో పేపర్‌లో వేసిన ‘పాఠశాల భవనం కూలి 48 మంది చిన్నారులు దుర్మరణం’ అనే వార్తను అర్జున్ శ్రద్ధగా చదువుతూ కనిపిస్తాడు. ఆ వార్త అతడిని కదిలించి, దానికి సంబంధించి అతడ్ని ఏదో పనికి పురిగొల్పి ఉండవచ్చు.

‘వెరిఫైడ్’ అనే స్టాంప్ కొట్టాక, అర్జున్ ఎడ్యుకేషన్ లోన్‌కు అప్లై చేసినట్లు, అప్లికేషన్‌పై అతడి ఫొటో, అతడి తండ్రి నాగేశ్వరరావు (నాగినీడు) ఫొటో కనిపిస్తాయి. ఆ వెంటనే అనంతపురం జేఎన్‌టీయూ జారీ చేసిన ఎంబీఏ సర్టిఫికేట్ సైతం కనిపిస్తుంది. కథకు వీటితో గట్టి సంబంధమే ఉండాలి.

ఇంకో సీన్‌లో గోడకు అంటించిన అనేక వార్తల కటింగ్స్, వాటి మధ్య పలువురి ఫొటోలు కనిపిస్తాయి. వాళ్లందరినీ కలుపుతూ గీతలు గీసి, ‘వాళ్లలో ఎవరు?’ అనే అర్థం వచ్చేలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవి ఎవరి ఫొటోలనేది చూడాలి.

సాధారణంగా హాస్యపాత్రల్లో కనిపించే వెన్నెల కిశోర్ ఈ సినిమాలో తద్భిన్నమైన కేరెక్టర్ చేశాడనిపిస్తుంది. ఒకసారి అతడ్ని అరవకుండా నోటిమీదుగా గుడ్డచుట్టి అర్జున్ బంధించిన సన్నివేశం ఉంది. కిశోర్ ముఖం నిండా చెమట్లు కనిపిస్తాయి. అతడి పాత్ర ఆసక్తికరమైందిగా తోస్తుంది.

వెన్నెల కిశోర్ కాకుండా విలన్ కేరెక్టర్లు వేసే కిశోర్ కూడా ఇందులో ఉన్నాడు. “ఎంత తెలివిగలవాడైనా కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాడు” అనే మాటలు అతడివే. అతడు పెద్ద పోలీసాఫీసర్ అయ్యుంటాడనీ, అర్జున్‌ను ఉద్దేశించో, ఇంకెవరైనా నేరగాడి గురించో ఆ మాటలన్నాడనీ ఊహించవచ్చు. విలన్‌గా తరుణ్ అరోరా కనిపించాడు.

టీజర్‌తో ఆసక్తి రేపిన ‘అర్జున్ సురవరం’ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అర్జున్ సురవరం: టీజర్ చెబుతున్న 8 విషయాలు