బైపాస్ సర్జరీ తర్వాత కెమెరా ముందుకు బ్రహ్మానందం


బైపాస్ సర్జరీ తర్వాత కెమెరా ముందుకు బ్రహ్మానందం

జనవరిలో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (ఏహెచ్ఐ)లో బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

సందీప్ కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆయన తనదైన వినోదాత్మక పాత్రను పోషిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నాగేశ్వరరెడ్డి రూపొందించిన ఇటీవల అన్ని చిత్రాల్లోనూ బ్రహ్మానందం కనిపించి నవ్వించారు.

జనవరి రెండో వారంలో గుండెనొప్పితో బాధపడిన బ్రహ్మానందంను కుటుంబసభ్యులు హుటాహుటిన ముంబైలోని ఏహెచ్ఐకి తరలించారు. అక్కడ డాక్టర్ రమాకాంత పండా ఆధ్వర్యంలో ఆయనకు జనవరి 15న శస్త్ర చికిత్స నిర్వహించారు. అప్పటునించీ విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన బ్రహ్మనందం పూర్తి స్వస్థతతో తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు.

చివరగా ఆయన జనవరిలో విడుదలైన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రంలో రేలంగి వెంకట్రామయ్య పాత్రలో రెండు నిమిషాలు కనిపించారు.