‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో చంద్రబాబుకి లాభం!


'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో చంద్రబాబుకి లాభం!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో చంద్రబాబుకి లాభం!

మార్చి 22 నుంచి మార్చి 29కి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల తేదీని జరిపిన రాంగోపాల్ వర్మ సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)పై ఒత్తిడి పెంచుతున్నారు. ఆ సినిమాని ప్రకటించినప్పట్నుంచీ ఏదో ఒక వివాదంతో ప్రచారం పొందుతూ వస్తోన్న వర్మ మార్చి 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయన డైరెక్ట్ చేసే సినిమాల నిర్మాతలు ఏమీ మాట్లాడరు కానీ, ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తుంటారు. సాధారణంగా సినిమా ఎలా ఉందో రిలీజయ్యాక అదే చెబుతుంది. కానీ విడుదల కాకముందే దానిపై జనం దృష్టి పడేందుకు వర్మ పడే తాపత్రయం, కష్టం తీసిపారేయదగ్గది కాదు. ఈ విషయంలో ఏ దర్శకుడూ పడనంత కష్టం వర్మ పడుతుంటాడు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు.

ఇప్పుడు కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలో ఆయన అమిత్ర ప్రయాస పడుతున్నారు. ఎందుకంటే తన సినిమాలో స్టార్లు ఎవరూ లేరు. చాలామంది అనామక నటులే. సాక్షాత్తూ ఎన్టీఆర్ పాత్రధారి జనానికి తెలీని విజయ్‌కుమార్ అనే ఒక రంగస్థల నటుడు. లక్ష్మీపార్వతి పాత్రధారి యజ్ఞాశెట్టి అనే తెలుగువాళ్లకు పరిచయం లేని కన్నడ నటి.

ఈ సినిమాకు సంబంధించిన స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది తానొక్కడినేనని వర్మకు తెలుసు. ఈ సినిమాకు సంబంధించి వర్మ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎందుకు ఆయనను వర్మ టార్గెట్ చేశారో ఆయనకు మాత్రమే తెలుసు. వైకాపా (వైసీపీ) మద్దతుదారులైన నిర్మాతలతో ఈ సినిమాని ఆయన తీశారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా రోజుకో ఎన్టీఆర్ డైలాగ్‌తో జనాన్ని ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తూ వస్తున్నాడు. నిన్నటి వరకూ అందులో ఆయన సఫలీకృతుడయ్యాడనే అనుకోవాలి. అయితే ఆయన మితిమించిన చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చివరకు చంద్రబాబుకే లాభించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైకాపాయే ఆయన చేత ఇలా చేయిస్తున్నదనే ప్రచారం చాపకింద నీరులా సాగి, చంద్రబాబుపై సానుభూతి కలిగేలా చేస్తున్నదని వాళ్లంటున్నారు.

సెన్సార్ సర్టిఫికెట్ లభించి మార్చి 29న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలైతే, అది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును విలన్‌గా చూపించారనే భావాన్నే ప్రజల్లోకి తీసుకు వెళ్తుందనీ, తద్వారా చంద్రబాబుకు ఎన్నికల్లో నష్టం కంటే లాభమే కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు అనుకూలురు ఇప్పటికే ఈ అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లారు. అందుకే చంద్రబాబు సైతం ఆ సినిమా విడుదలైతే తనకే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో చంద్రబాబుకి లాభం! | actioncutok.com

You may also like:

One thought on “‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో చంద్రబాబుకి లాభం!

Comments are closed.