‘సాహో’ హిందీ హక్కులు అంత రేటు నిజమేనా?


'సాహో' హిందీ హక్కులు అంత రేటు నిజమేనా?

‘సాహో’ హిందీ హక్కులు అంత రేటు నిజమేనా?

ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు సినీ హీరో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవాప్తంగా ఫాలోయింగ్ ఉన్న హీరో. తెలుగులో మరే హీరోకూ దక్కని పాపులారిటీ ‘బాహుబలి’తో సంపాదించాడు. అందుకు రాజమౌళికి అతను ఎప్పటికీ థాంక్స్ చెప్పుకోవాల్సిందే.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా రూపొందుతోంది. ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ ఈ సినిమాకి దర్శకుడు. శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పట్నుంచీ దానిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. టీజర్ల విడుదల తర్వాత ఏ రేంజిలో ఆ సినిమా రూపొందుతోందో ప్రపంచానికి తెలిసింది. అందుకు తగ్గట్లే హిందీ వెర్షన్ హక్కుల కోసం మహా డిమాండ్ ఏర్పడింది.

‘బాహుబలి’ రెండు వెర్షన్లను హిందీలో విడుదల చేసిన కరణ్ జోహార్ ‘సాహో’ హిందీ హక్కులు తీసుకుంటారని భావించినా, చివరకు వాటిని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల కోసం ఆయన ఏకంగా రూ. 120 కోట్లు చెల్లించారని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. దీన్ని అసాధారణంగా చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ అగ్ర కథానాయకులు నటించిన అనేక సినిమాలు సైతం ఆ ధర పలకకపోవడం గమనార్హం. ఇప్పుడు భూషణ్‌కుమార్ చెల్లించిన ధరగా బయటకు వినిపిస్తోన్న అంకె నిజమే అయితే, బాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్‌ను చూసి అసూయ పడటం ఖాయం.

శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం సమకూరుస్తున్న ‘సాహో’ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవనున్నది.

Related articles: