సుక్కుతో సినిమా లేదని మహేశ్ చెప్పేశాడు!


సుక్కుతో సినిమా లేదని మహేశ్ చెప్పేశాడు!
మహేశ్

తేలిపోయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్‌తో తాను సినిమా చెయ్యలేకపోతున్నానని మహేశ్ స్వయంగా వెల్లడించాడు. అల్లు అర్జున్ హీరోగా రూపొందే 20వ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడనీ, దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నదనీ అధికారికంగా వెల్లడవటంతో మహేశ్, సుకుమార్ కాంబినేషన్ సినిమాపై రకరకాల వదంతులు రావడం మొదలైంది.

వీటికి చెక్ చెప్పే ఉద్దేశంతో మహేశ్ స్వయంగా సీన్‌లోకి వచ్చాడు. ట్విట్టర్ వేదికగా సుకుమార్ కొత్త సినిమా ప్రకటనకు శుభాభినందనలు తెలిపాడు. ఒక ఫిలింమేకర్‌ని తానెప్పుడూ గౌరవిస్తానని చెప్పాడు. తమ కలయికలో వచ్చిన ‘1.. నేనొక్కడినే’ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోతుందన్నాడు. ఆ సినిమాకు పనిచేసిన ప్రతి క్షణాన్నీ తాను ఆస్వాదించానని మహేశ్ చెప్పుకొచ్చాడు.

‘మహర్షి’ సినిమా తర్వాత సుకుమార్‌తో సినిమా చెయ్యడానికి సిద్ధమైన మహేశ్, అంతలోనే దాని బదులు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడని ప్రముఖంగా ప్రచారమైంది. అయితే ఆ ప్రచారం నిజం కాకపోవచ్చని చాలామంది భావించారు. కానీ చివరకు అదే నిజమైంది. సుకుమార్ సినిమా స్థానంలో ‘ఎఫ్2’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి పనిచెయ్యడానికే మహేశ్ మొగ్గుచూపాడు.

ఇప్పుడు మహేశ్‌తో చెయ్యాల్సిన సినిమాని అల్లు అర్జున్‌తో చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు సుకుమార్.