అంబేద్కర్‌పై సినిమా నిర్మించనున్న ‘కాలా’ దర్శకుడు


అంబేద్కర్‌పై సినిమా నిర్మించనున్న 'కాలా' దర్శకుడు
Pa Ranjith

రజనీకాంత్‌తో రూపొందించిన ‘కాలా’ సినిమాలో అంబేద్కర్ భావాల్ని, దళిత భావజాలాన్ని ప్రదర్శించిన దర్శకుడు పా రంజిత్, ఇప్పుడు అంబేద్కర్‌పై ఒక సినిమానే నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. ఈ సినిమాతో ముంబైకి చెందిన జ్యోతినిష దర్శకురాలిగా పరిచయం కానున్నది. ఈ సినిమాకు ‘బీఆర్ అంబేద్కర్ నౌ అండ్ దెన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

నేటి కాలానికి అంబేద్కర్ ఎలా అన్వయిస్తారో ఈ సినిమాలో చూపించనున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. రెండు నెలల్లో రూ. 20 లక్షలు వసూలు చెయ్యాలని ఆశాభావంతో ఉన్నారు. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందనీ, ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందనీ ట్విట్టర్ వేదికగా రంజిత్ తెలిపాడు.

జ్యోతినిష సైతం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పా రంజిత్ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ ‘బీఆర్ అంబేద్కర్ నౌ  అండ్ దెన్’ సినిమాని నిర్మిస్తుండటం ఉద్వేగాన్నిస్తోందన్నారు.

మరోవైపు 18వ శతాబ్దంలో బ్రిటీష్‌వాళ్లపై తిరుగుబాటు చేసిన జార్ఖండ్ గిరిజన నాయకుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా రూపొందే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టబోతున్నాడు పా రంజిత్.