ఏప్రిల్లో మొదలవనున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’


'కేజీఎఫ్ చాప్టర్ 2'

కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్ (కేజీఎఫ్ చాప్టర్ 2) నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో మొదలు కానున్నది.

తొలి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత రితీశ్ సిధ్వాని ఈ విషయం వెల్లడించాడు. ఒరిజినల్‌ను సీక్వెల్ అధిగమిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన, సీక్వెల్ స్టోరీ టెల్లింగ్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పాడు. ప్రస్తుతం ప్రశాంత్ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడు.

కేజీఎఫ్ చాప్టర్ 2 లో హిందీ నటులు ఉంటారని నిర్మాత రితీశ్ ధ్రువీకరించాడు. కొద్ది రోజుల క్రితం విలన్ కేరెక్టర్‌కు సంజయ్‌దత్‌ను సంప్రదించారు కానీ డేట్స్ వర్కవుట్ కాలేదు. స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయ్యాక అప్పుడు నటుల్ని సంప్రదించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఉత్తర భారత ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాలంటే హిందీ నటులు తప్పకుండా ఉండాలని ఆయన భావిస్తున్నాడు.

2018 క్రిస్టమస్ కాలంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన వసూళ్లను రాబట్టింది. కన్నడంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబర్ 1గా నిలిచిన ఆ సినిమా, తెలుగు హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ డబ్బింగ్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ సినిమాతో యశ్ సూపర్ స్టార్‌గా అవతరించాడు.