మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్లే!


మార్చి 22న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల లేనట్లే!

మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్లే!

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాంగోపాల్ వర్మ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అలజడి సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక జరిగిన పరిణామాలు, తన కుటుంబమే ఆయనను దూరం పెట్టిన వైనంతో ఈ సినిమాని ఆర్జీవీ రూపొందించారు.

ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఈ సినిమాతో ఆయన స్పష్టంగా చూపిస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించిన ఆయన అందుకు అనుగుణంగా క్లియరెన్స్ కోసం సెన్సార్ బోర్డుకు తన సినిమాని అందించారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో తానేం చూపిస్తున్నాడనే అంశాల్ని సోషల్ మీడియా ద్వారా ఆర్జీవీ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబును నెగటివ్‌గా చిత్రీకరించారనీ, ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశమనీ టీడీపీ చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పరిశీలిస్తుండగా, ఏప్రిల్ 11వ తేదీలోగా ఈ సినిమాను పరిశీలించి, సర్టిఫికేట్‌ను ఇవ్వలేమని ఆర్జీవీకి సెన్సార్ బోర్డ్ నుంచి లేఖ అందింది.

ఈ విషయాన్ని ఆర్జీవీ తన ఫేస్‌బుక్  పేజీ ద్వారా స్వయంగా బయటపెట్టారు. సెన్సార్ బోర్డ్ నిర్ణయం వర్మకూ, ఆ చిత్ర నిర్మాతలకూ అశనిపాతం లాంటి వార్త అని చెప్పాలి. అయితే దీనిపై కోర్టుకు వెళ్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఏదేమైనా కోర్టులో ఈ కేసు ఎప్పటికి విచారణకు వస్తుందో, ఎప్పుడు తీర్పు వెలువడుతుందో తెలీదు.

వర్మ బృందానికి అనుకూలంగా తీర్పు వస్తుందనుకున్నా, అదెప్పటికి వస్తుందో తెలీదు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు ఆ చిత్రాన్ని పరిశీలించాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి. దీనికి కనీసం రెండు మూడు వారాల సమయమైనా పట్టొచ్చు. అందువల్ల మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్లేనని తెలుస్తోంది.

మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్లే! | actioncutok.com

You may also like:

One thought on “మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్లే!

Comments are closed.