పద్మ పురస్కారాలు అందుకున్న మోహన్‌లాల్, ప్రభుదేవా


పద్మ పురస్కారాలు అందుకున్న మోహన్‌లాల్, ప్రభుదేవా

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డులను అందజేశారు. చిత్రరంగానికి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా, శంకర్ మహదేవన్ రాష్ట్రపతి నుంచి పురస్కారాలను అందుకున్నారు.

కళారంగానికి చేసిన విశేష సేవలకు గాను మలయాళం నటుడు మోహన్‌లాల్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో పాత్రల్ని పోషించి దేశంలోని గొప్ప నటుల్లో ఒకరిగా ఆయన ఖ్యాతి సంపాదించుకున్నారు.

మాతృభాష మలయాళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాలు పొందారు. నిర్మాతగానూ ఒకసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా ‘జనతా గారేజ్’లో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం పొందారు.

పద్మ పురస్కారాలు అందుకున్న మోహన్‌లాల్, ప్రభుదేవా

కళారంగానికి సంబంధించి నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన కెంపు రంగు చొక్కా, తెల్లటి పంచెతో సంప్రదాదుస్తుల్లో కార్యక్రమానికి హాజరుకావడం అందర్నీ ఆకట్టుకుంది. ఆయన తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ప్రభుదేవా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ చిత్ర సీమల్లో పనిచేశారు. 25 ఏళ్ల కెరీర్‌లో భిన్న రీతుల నృత్యాల్ని డిజైన్ చేసి, వాటిని ప్రదర్శించారు. మొదట తండ్రి సుందరం బాటలో కొరియోగ్రాఫర్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆయన, తర్వాత ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా పరిచయమై సంచలనం సృష్టించారు. తెలుగు సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో దర్శకుడిగా మారారు.

కళారంగానికి చేసిన సేవలకు గాను శంకర్ మహదేవన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన పేరుపొందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ప్రపంచవాప్తంగా అనేక కచేరీలు నిర్వహించి శాస్త్రీయ సంగీతం, జాజ్, ఫ్యూజన్, రాక్, జానపద్, సినీ, భక్తి సంగీతాలకు ప్రాచుర్యం సంపాదించి పెట్టారు. సుప్రసిద్ధ సంగీత త్రయం ‘శంకర్-ఎహ్సాన్-లాయ్’లలో ఆయన ఒకరు. ప్రస్తుతం తెలుగులో ‘సాహో’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పద్మ పురస్కారాలు అందుకున్న మోహన్‌లాల్, ప్రభుదేవా – actioncutok.com