శివాజీరాజాపై నాగబాబు విమర్శలు


శివాజీరాజాపై నాగబాబు విమర్శలు

వేడెక్కిన ‘మా’ ఎన్నికల వాతావరణం

ఆదివారం జరగనున్న ‘మా’ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎవరూ ఊహించని విధంగా నరేశ్ ప్యానల్‌కు సపోర్ట్ చెయ్యడమే కాకుండా శివాజీరాజా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చెయ్యడం చర్చనీయాంశమైంది.

గమనించదగ్గ విషయమేమంటే మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితుడైన నటుడు శ్రీకాంత్ సైతం శివాజీరాజా ప్యానల్ తరపున కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పోటీలో ఉండటం.

ఇప్పుడు నరేశ్ బృందానికి నాగబాబు మద్దతు పలకడంతో మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న శివాజీరాజా ప్యానల్‌లోని వాళ్లు ఖంగు తిన్నారని చెప్పాలి. ‘మా’పై ఎవరైనా విమర్శలు చేస్తే శివాజీరాజా గట్టిగా నిలబడి మాట్లాడలేదని నాగబాబు విమర్శించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ “మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వాళ్లు లేరు. ఈ విషయంలో మునుపటి కమిటీ అంటే శివాజీ రాజా విషయంలో నేను చాలా అసంతృప్తి చెందాను” అని స్పష్టం చేశారు.

‘మా’ మీద ఎవరుపడితే వాళ్లు రాళ్లు విసరడం, ఎవరుపడితే వాళ్లు నోరు చేసుకోవడం బాధ అనిపించిందన్నారు. అప్పుడు జీవిత గారు మాట్లాడటం నాకు సంతోషంగా అనిపించిందని చెప్పారు.

‘మా’ స్పిరిట్‌ను కాపాడుకోవాలి, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, ‘మా’ సమగ్రతను కాపాడుకోవాలి అని ఆయన నటులకు పిలుపునిచ్చారు. “మునుపటివాళ్ల దగ్గర నాకది కనిపించలేదు. ఆ ఒక్క విషయంలో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను” అని నాగబాబు చెప్పారు.

జీవితగారు అప్పుడు కమిటీలో లేకపోయినా ఆవిడ చేతనైనంతలో మాట్లాడారనీ, నరేశ్ మాట్లాడారనీ ఆయన వాళ్లను ప్రశంసించారు.

సమీకరణాలు మారనున్నాయా?

నిజానికి నరేశ్ ప్యానల్ కంటే శివాజీరాజా ప్యానల్ బలంగా కనిపిస్తోంది. పేరు పొందిన వాళ్లు ఆ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నారు. నరేశ్ ప్యానల్‌లో రాజశేఖర్, జీవిత మినహాయిస్తే పేరుపొందినవాళ్లు తక్కువమందే ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు సపోర్ట్ లభించడం వల్ల మెగా హీరోలు నరేశ్ ప్యానల్‌కు మద్దతు తెలుపుతున్నట్లయింది.

నాగబాబు ఇలా నరేశ్ వైపు నిలబడ్డానికి కారణం శ్రీరెడ్డి ఉదంతమేనని వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వస్తోన్న శ్రీరెడ్డి ఆయన ‘పావలా’ అంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. గతంలో ‘మా’పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆ సమయంలో ‘మా’ ఆమె విషయంలో మెతకధోరణి అవలంబించిందనీ, గట్టిగా తన వాయిస్‌ను వినిపించలేకపోయిందనీ మెగా క్యాంప్ అసంతృప్తిలో ఉంది. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు జీవిత గట్టిగా గళం విప్పారు.

తాజా ఎన్నికల్లో నరేశ్ ప్యానల్‌ను దుర్భాషలాడుతూ, శివాజీరాజా ప్యానల్‌కు ఓట్లేయమని పిలుపునివ్వడం మెగా క్యాంప్ గమనిస్తోందనీ, అందుకే నాగబాబు బాహాటంగా నరేశ్ ప్యానల్‌కు మద్దతు తెలిపారనీ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనితో రానున్న ఎన్నికల్లో సమీకరణాలు మారే అవకాశం ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివాజీరాజా ప్యానల్‌కు విజయం అంత సులువుగా దక్కకపోవచ్చనీ, దాని కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించాల్సిందేననీ అంటున్నారు.