‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ టీజర్ చెబుతున్న7 విషయాలు


'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' టీజర్ చెబుతున్న7 విషయాలు

అడివి సాయికిరణ్ డైరెక్ట్ చేసిన ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి ఆహ్లాదకర చిత్రాల్ని రూపొందించిన సాయికిరణ్ నుంచి ఉగ్రవాదం, కశ్మీరీ సమస్య నేపథ్యంతో సినిమా రావడం ఆశ్చర్యకరమే.

టీజర్ చూస్తే డైరెక్టర్‌గా సాయికిరణ్‌లోని మరో కోణం దర్శనమిస్తుంది. నో డౌట్, ఆయన తెలుగు చిత్రసీమల్లోని ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఒరవడిలో కొట్టుకుపోని, మనసుకు నచ్చిన, మనసును స్పృశించే కథలకే ప్రాధాన్యమిచ్చే దర్శకుడిగా మరోసారి ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’తో మన ముందుకు రాబోతున్నాడని టీజర్ స్పష్టం చేస్తోంది.

80 సెకన్ల నిడివి టీజర్‌లోనే అనేక విషయాలను ఆయన చూపించాడు. ఆడుతూ పాడుతూ, కేరింతలు కొడుతూ, కాలేజీలో చదువుకుంటూ వేరే ధ్యాస లేకుండా జీవితాన్ని ఆస్వాదించే నలుగురు కాలేజీ స్టూడెంట్స్ (రెండు జంటలు) ఉగ్రవాదుల చెరలోకి వెళ్లి అనుభవించిన నరకాన్ని ఈ టీజర్ మన కళ్లముందుంచింది. ఆ నలుగురిలో ఎవరు మిగిలారో, ఎవరు పోయారో సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది.

ఎన్ఎస్‌జీ కమాండోగా ఆది మనకు కనిపిస్తాడు. అతను చేసిన ఒక తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయంటూ పై అధికారి అతడిని ఆక్షేపించడం చూస్తే అతడు ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే క్రమంలోనే వాళ్ల ప్రాణాలు పోయాయని మనకు బోధపడుతుంది.

కశ్మీర్ నుంచి పండిట్లను తరిమివెయ్యాలనే లక్ష్యం కలిగిన ఉగ్రవాది గాజీబాబాగా రచయిత అబ్బూరి రవి కనిపించి ఆశ్చర్యపరుస్తాడు. నటుడిగా అతడి ప్రస్థానానికి ఇది తొలిమెట్టు అవుతుందో, ఇదే చివరి చిత్రమవుతుందో చూడాలి.

'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' టీజర్ చెబుతున్న7 విషయాలు

“కశ్మీర్ చోడ్‌కే చలే జావ్” అంటూ కత్తితో ఒక పండిట్‌ను అతను నరికెయ్యడం చూస్తే, దర్శకుడు ఒక కత్తిమీద సాము లాంటి, ఇంతదాకా తెలుగు దర్శకులెవరూ టచ్ చెయ్యని సబ్జెక్ట్‌ను టచ్ చేస్తున్నాడని అవగతమవుతుంది.

బాల నటుడి నుంచి చిన్న సినిమాల హీరోగా ఎదిగిన మనోజ్ నందం సైతం ఈ సినిమాలో కథకు కీలకమైన ఒక కశ్మీరీ ముస్లింగా కనిపించనున్నాడు. అతడు ఒక సాధారణ ముస్లిం కాదనీ, పండిట్లపై ద్వేషాన్ని పెంచుకున్న కరడుగట్టిన ఛాందస ముస్లిం యువతకు ప్రతినిధిగా కనిపించనున్నాడనీ అర్థమవుతోంది.

సాయికిరణ్ తీసిన ‘వినాయకుడు’తోటే హీరోగా తొలిసారి కనిపించి మెప్పించిన కృష్ణుడు ఈ సినిమాలో నవ్వించే బాధ్యతను తీసుకున్నట్లు భావించవచ్చు. కౌబాయ్ తరహా వేషధారణతో ఆతడు ప్రేక్షకుల పెదాలపై నవ్వు పుట్టిస్తాడు. అదే సమయంలో అతడూ కశ్మీర్ సమస్యలో చిక్కుకుంటాడని కూడా ఊహించవచ్చు.          

రావు రమేశ్ ఒక మంత్రిగా, బహుశా హోం మంత్రిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అనీష్ కురువిల్లా “దేని మీద యుద్ధం.. ఎవరి మీద యుద్ధం?” అని ఎవరినో ప్రశ్నించడం మనం చూస్తాం. అతనొక ప్రభుత్వ అధికారి అని ఊహించవచ్చు.

టైటిల్‌లో ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ అన్నారు. గాజీబాబాను విలన్‌గా చూపించారు. మరి ఈ గోల్డ్‌ఫిష్ ఎవరు? గాజీబాబాయే గోల్డ్‌ఫిష్షా? లేక ఎవరూ ఊహించని మరొకరా? గోల్డ్‌ఫిష్ ఎవరో కనిపెట్టి, పట్టుకొనే బాధ్యతను అర్జున్ పండిట్ తీసుకున్నాడని టీజర్ చెబుతోంది.

కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా 1980లలో కశ్మీరీ పండిట్ కుటుంబాలకు జరిగిన అన్యాయాలపై ఫోకస్ పెట్టి ఈ సినిమాని అడివి సాయికిరణ్ రూపొందించాడు. టీజర్ చూస్తే ఒక ఆసక్తికరమైన సినిమాని చూడనున్నామనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' టీజర్ చెబుతున్న7 విషయాలు

Related articles:

One thought on “‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ టీజర్ చెబుతున్న7 విషయాలు

Comments are closed.