‘వెంకీమామ’ సెట్స్‌పై అడుగుపెట్టిన భామ


'వెంకీమామ' సెట్స్‌పై అడుగుపెట్టిన భామ

తెలుగులో తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సంచలన తారగా పేరు తెచ్చుకొన్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పేరు పొందిన హీరోలు ఆమెను తమ సరసన రికమెండ్ చేస్తున్నారు. వాటిలో తన కెరీర్‌కు ఉపయోగపడతాయనుకొనే సినిమాలనే ఆమె ఎంచుకుంటూ వస్తోంది.

నాగార్జున సరసన ఒక నాయికగా ‘మన్మథుడు 2’లో ఛాన్స్ దక్కించుకున్న పాయల్, ‘వెంకీ మామ’లో మరో సీనియర్ హీరో వెంకటేశ్‌తో రొమాన్స్ చేసేందుకు సరేనన్నది. ఈ సినిమాలో మరో జంటగా నాగచైతన్య, రాశీ ఖన్నా నటిస్తున్నారు.

కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెట్స్‌పై శనివారమే తొలిసారిగా అడుగుపెట్టింది పాయల్. “సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ న్యూ తెలుగు మూవీ వెంకీ మామ” అంటూ ట్వీట్ చేసి, అందంగా సిగ్గుపడుతున్నట్లు ఫొటోను జత చేసింది.

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై డి. సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.