ప్రియాంక ఆ కేరెక్టర్ ఎందుకు చేసిందంటే..


ప్రియాంక ఆ కేరెక్టర్ ఎందుకు చేసిందంటే..
‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’లో ప్రియాంకా చోప్రా, ఆడమ్ డివైన్

బాలీవుడ్ నుంచి అమెరికన్ టెలివిజన్‌కూ, అక్కడ్నుంచి హాలీవుడ్‌కూ వెళ్లిన ప్రియాంకా చోప్రా తొలిగా అక్కడ ‘బే వాచ్’ సినిమాలో నెగటివ్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ విడుదలైంది. ఇందులో ఆమె పాత్ర చూసిన వాళ్లంతా పెదవి విరుస్తున్నారు. ఆ పాత్రను చేయాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చిందని అడుగుతున్నారు.

‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’లో ప్రియాంకది ప్రధాన పాత్ర కాదు. ఈ సినిమాలో నటాలీ అనే నాయిక పాత్రను స్థూలకాయురాలైన రెబల్ విల్సన్ పోషిస్తే, ఆమె స్నేహితురాలు ఇసాబెల్లేగా ప్రియాంక కనిపించింది.

యోగా రాయబారిగా ఆమె పాత్రను పరిచయం చేసినా, కనిపించినంత సేపూ నటాలీ బాయ్‌ఫ్రెండ్ జోష్ (ఆడమ్ డివైన్)ను రాసుకు పూసుకు తిరుగుతూ, అతడిని కవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రియాంక.

అతిథి పాత్రకు ఎక్కువా, సపోర్టింగ్ రోల్‌కు తక్కువా అయిన ఇసాబెల్లే కేరెక్టర్‌ను చేసిందంటే ప్రియాంకకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. ఉంది కూడా.

“చెప్పడానికి నాకు, వినడానికి మీకు ఫన్నీగా ఉంటుంది కానీ ఈ సినిమా నేనెందుకు చేశానో తెలుసా! నా షెడ్యూల్‌లోని తీరిక సమయంలోనే ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. చేసేశాను” అని తన నోటితో స్వయంగా చెప్పింది ప్రియాంక. అంటే చేసే పాత్ర ఎటువంటిదైనా, ఖాళీ దొరికితే చేసేయడమే తన పని అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తోందన్న మాట.