‘మా’ కొత్త కార్యవర్గంలో అప్పుడే లుకలుకలు!


'మా' కొత్త కార్యవర్గంలో అప్పుడే లుకలుకలు!

‘మా’ కొత్త కార్యవర్గంలో అప్పుడే లుకలుకలు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం ఎన్నికై ఎన్నో రోజులు కాలేదు. అప్పుడే దానిలో అసంతృప్తి జాడలు బయటపడుతున్నాయి. అదీ.. కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కావడం గమనార్హం. మార్చి 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో నరేశ్ అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

మునుపటి అధ్యక్షుడు శివాజీరాజా పదవీ కాలం మార్చి 31 వరకు ఉన్నప్పటికీ మార్చి 22న ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని నరేశ్ భీష్మించిన విషయం వివాదాస్పదమైంది. తాజాగా నరేశ్ ప్యానల్ తరపున కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రాజశేఖర్ ప్రమణ స్వీకార సమయంలోనే నరేశ్‌పై అసంతృప్తి వ్యక్తం చెయ్యడం చాలామందిని విస్మయానికి గురిచేసింది.

ప్రమాణ స్వీకార సందర్భంగా మాట్లాడిన నరేశ్ తన ప్రసంగంలో ‘మేము’ అనకుండా పదే పదే ‘నేను’ అనడం రాజశేఖర్‌కు కోపాన్ని తెప్పించింది. ‘మా’ అంటే అందరిదీ అనీ, కానీ అది తానొక్కడిదే అన్న తరహాలో నరేశ్ ‘నేను.. నేను’ అంటూ వచ్చారనేది రాజశేఖర్ అసహనానికి కారణం. తన అసంతృప్తిని ఆయన బహిరంగంగానే ప్రదర్శించారు.

“ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడ్డం నాకిష్టం లేదు” అని మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు. తర్వాత భార్య జీవిత నుంచి మళ్లీ మైకు తీసుకున్న ఆయన “అందరం కలిసి ఎన్నికల్లో పనిచేశాం. కాబట్టి నరేశ్ ఇకనుంచి ‘నేను’ అని కాకుండా ‘మేము’ అని మాట్లాడితే బాగుంటుంది” అన్నారు. దీనిపై ఆయనకు నరేశ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అందరం కలిసే పని చేశామని నరేశ్ ఒప్పుకున్నారు.

ఎన్నికల్లో గెలిచాక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నరేశ్ బృందం మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు వాళ్లలో జీవిత, రాజశేఖర్ దంపతులు లేకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ విడిగా మంత్రిని కలిసి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు నరేశ్‌పై రాజశేఖర్ బాహాటంగా అసంతృప్తి వ్యక్త చెయ్యడం చూస్తుంటే “ఆల్ ఈజ్ నాట్ వెల్” అనిపిస్తోందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కృష్ణ, కృష్ణంరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలు ఈ వేడుకకు హాజరయ్యారు. వాళ్ల సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం.

‘మా’ కొత్త కార్యవర్గంలో అప్పుడే లుకలుకలు! | actioncutok.com

You may also like: