నేనెప్పటికీ శ్రీదేవిని కాలేను!


నేనెప్పటికీ శ్రీదేవిని కాలేను!

ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో శ్రీదేవిగా కొద్దిసేపు కనిపించింది రకుల్‌ప్రీత్ సింగ్. వెండితెరపై శ్రీదేవి రోల్‌ను చేసిన తొలితారగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. “శ్రీదేవి పాత్రను ఎవరైనా తెరపై పోషించడం అదే తొలిసారి. ఆమెకు నేను పెద్ద అభిమానిని. ఆమె పాత్రను పోషించడం కచ్చితంగా నాకు లభించిన గౌరవం” అని చెప్పింది రకుల్.

ఆమె చేసింది అతిథి పాత్రే అయినా అది తనపై ఒత్తిడి కలిగించిందని ఆమె తెలిపింది. “ఆమె ఇప్పుడు మన మధ్య లేరు. ప్రేక్షకులు తప్పకుండా మా ఇద్దర్ని పోల్చి చూస్తారు. ఆ మేరకు ఒత్తిడి ఫీలయ్యాను. ఆమె లెజెండరీ యాక్ట్రెస్. నేనెప్పటికీ ఆమెలా కాలేను. కానీ ఆమెను తెరపై రీక్రియేట్ చెయ్యడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను” అని ఆమె చెప్పింది.

‘వేటగాడు’ సినిమాలో సూపర్ హిట్టయిన ‘ఆకుచాటు పిందె తడిసె’ పాటను ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్, శ్రీదేవి పాత్రల్ని చేసిన బాలకృష్ణ, రకుల్‌ప్రీత్‌పై చిత్రీకరించారు. దాని ప్రిపరేషన్ కోసం శ్రీదేవి చేసిన అనేక సినిమాల్ని ఆమె చూసింది. “నాది చాలా చిన్న పాత్ర. ఒక పాటను రీక్రియేట్ చేశారు. లుక్ టెస్ట్‌కే డైరెక్టర్ రెండు రోజులు తీసుకున్నారు” అని వివరించింది రకుల్.

అజయ్ దేవ్‌గణ్ జోడీగా ఆమె నటిస్తోన్న ‘దే దే ప్యార్ దే’ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

నేనెప్పటికీ శ్రీదేవిని కాలేను! – actioncutok.com

You may also like: