రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త!


రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త!

రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త!

కథన నైపుణ్యం, సన్నివేశాల కల్పనతో పాటు పాత్రల సృష్టి విషయంలో కొంతమంది దర్శకులు అసమాన ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా అనవసర వివాదాలతో, ప్రచారార్భాటంతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో నిస్సందేహంగా రాంగోపాల్ వర్మ ఒకరు.

తొలి చిత్రం ‘శివ’తోటే దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని తనవైపుకు తిప్పుకున్న ఆయన రెండో సినిమా ‘క్షణ క్షణం’ను రూపొందించిన తీరు చూసి అబ్బురపడిపోయారు. ఆయన కథన చాతుర్యానికి శెభాష్ అన్నారు. ఆ తర్వాత కూడా ఆయన మేధస్సు నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి.

తన వ్యవహార సరళి కారణంగా మునుపటి ప్రాభవాన్ని కోల్పోయి, కేవలం మాటలతో, వివాదాలతో నెగ్గుకొస్తున్నాడనే అపప్రథను ఆయన మూటగట్టుకున్నా, అనేక సినిమాల్లో పాత్రల్ని ఆయన డిజైన్ చేసిన తీరును తక్కువ చెయ్యలేం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్న దర్శకుల్లో ఆయన ఒక ‘బెస్ట్ కేరెక్టర్ క్రియేటర్’.

‘శివ’ సినిమాలో హీరో పాత్రను ఎంత బాగా ఆయన సృష్టించాడో, భవానీ (రఘువరన్) పాత్రను అంతకంటే బాగా మలిచాడు. ఆ తర్వాత కాలంలో విలన్ కేరెక్టర్లకు భవానీ ఒక రిఫరెన్స్‌గా నిలిచాడనేది నిజం.

రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త!

‘క్షణ క్షణం’లో చందు (వెంకటేశ్) హీరో. కానీ ఆ పాత్ర కంటే ఆయన మరో రెండు పాత్రల్ని ఎక్కువ ప్రేమతో, ఎక్కువ శ్రద్ధతో డిజైన్ చేశాడని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ పాత్రలు.. శ్రీదేవి పోషించిన సత్య, పరేశ్ రావల్ పోషించిన నాయర్. సత్య పాత్ర చిత్రణతో దర్శకుడిగా ఆయన అసాధారణ మేధస్సు బయటపడింది. ఒక వైపు జోవియల్‌గా ఉంటూ, ఇంకో వైపు క్రూయల్టీని ప్రదర్శించే నాయర్ కేరెక్టరైజేషన్ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఆ తర్వాత కాలంలో రాంగోపాల్ వర్మ సృష్టించిన పాత్రలు, వాటితో చేసిన మేజిక్‌కు కొన్ని ఉదాహరణలు…

గాయం – దుర్గ (జగపతిబాబు), గురు నారాయణ్ (కోట శ్రీనివాసరావు), అనిత (రేవతి)

గోవిందా గోవిందా – నవీన (శ్రీదేవి), సత్యానందస్వామి (కోట శ్రీనివాసరావు)

రంగీలా – మున్నా (ఆమిర్ ఖాన్), మిలి (ఊర్మిళ), రాజ్‌కమల్ (జాకీ ష్రాఫ్)

అనగనగా ఒక రోజు – చక్రి (జె.డి. చక్రవర్తి), మధు (ఊర్మిళ), మైఖెల్ జాక్సన్ (బ్రహ్మానందం)

సత్య – సత్య (జె.డి. చక్రవర్తి), భికు (మనోజ్ బాజ్‌పేయీ), కల్లు మామ (సౌరభ్ శుక్లా)

కౌన్ – పేరులేని నాయిక (ఊర్మిళ)

కంపెనీ – మాలిక్ (అజయ్ దేవ్‌గణ్), చందు (వివేక్ ఓబరాయ్), శ్రీనివాసన్ (మోహన్‌లాల్), రాణీబాయ్ (సీమా బిశ్వాస్)

భూత్ – స్వాతి (ఊర్మిళ)

అబ్ తక్ చప్పన్ – సాధు అగాషే (నానా పటేకర్), ఇంతియాజ్ సిద్దికి (యశ్పాల్ శర్మ)

సర్కార్ – సుభాష్ నాగ్రే (అమితాబ్ బచ్చన్), విష్ణు నాగ్రే (కేకే మీనన్), మోతీలాల్ ఖురానా (అనుపం ఖేర్)

సర్కార్ రాజ్ – శంకర్ నాగ్రే (అభిషేక్ బచ్చన్), అనితా రాజన్ (ఐశ్వర్యా రాయ్), హసన్ ఖాజి (గోవింద్ నాందేవ్)

రక్త చరిత్ర – కత్తుల ప్రతాప్ రవి (వివేక్ ఓబరాయ్), డీసీపీ మోహన్ ప్రసాద్ (సుదీప్)

డిపార్ట్‌మెంట్ – సర్జేరావ్ గైక్వాడ్ (అమితాబ్), మహదేవ్ భోస్లే (సంజయ్ దత్)

కిల్లింగ్ వీరప్పన్ – వీరప్పన్ (సందీప్ భరద్వాజ్), ఐపీఎస్ ఆఫీసర్ (శివ రాజ్‌కుమార్)

రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త!

ఇప్పుడు ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తీసి వార్తల్లో నిలుస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రల్ని ఆయన ఎలా మలిచాడనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఆ సినిమాని ఆయన ఎలా తీశాడనేది ఆ సినిమాయే చెప్పాలి కానీ, జనం ముందుకు రాక మునుపే ఆ సినిమా గురించి ఆయనే చెప్పుకుంటూ వస్తున్నాడు.

ఒక గొప్ప దర్శకుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడనే దానికి కూడా రాంగోపాల్ వర్మ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇప్పటికీ ఆయనను అభిమానించే నవతరం దర్శకులు అనేకమంది ఉన్నారు. ఎందుకంటే భారతీయ సినిమా గమనంపై ఆయన వేసిన ముద్ర అలాంటిది.

మునుముందైనా ఆయన తను మాట్లాడకుండా, తన సినిమాలతోటే మాట్లాడిస్తే ఎంత బాగుంటుంది!

– వనమాలి

రాంగోపాల్ వర్మ: అసమాన పాత్రల సృష్టికర్త! | actioncutok.com

You may also like: