‘ఖైదీ’గా కార్తీ!


'ఖైదీ'గా కార్తీ!

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తీ విడుదల చేశాడు. ఆ సినిమా పేరు ‘ఖైదీ’. అవును. ఒకప్పుడు చిరంజీవిని స్టార్‌ను చేసిన సినిమా టైటిల్‌తో ఇప్పుడు కార్తీ సినిమా చేస్తున్నాడు.

సూపర్ హిట్టయిన చిరంజీవి సినిమా టైటిల్స్‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే నాని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

కార్తీ ‘ఖైదీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే, అది ఒక ఇంటెన్స్ డ్రామా అనే అభిప్రాయం కలుగుతోంది. “ఇది పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్. చాలా మంది మంచి నటులు, సాంకేతిక నిపుణులతో పనిచేస్తుండటం హ్యాపీగా ఉంది” అని తెలిపాడు కార్తీ. ఈ తరహా సినిమాని తాను ఇదివరకు చెయ్యలేదని అతను తెలిపాడు.

లోకేశ్ 2017లో ‘మానగారం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ప్రశంసలు అందుకున్నాడు. థ్రిల్లర్‌గా రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ఆసక్తికరమైన విషయమేమంటే, ‘ఖైదీ’లో కార్తీ సరసన నాయిక అంటూ ఎవరూ ఉండరని ఇదివరకే లోకేశ్ తెలిపాడు. ఈ సినిమాలో నరైన్, దీన, జార్జి మరియన్ వంటి ప్రతిభావంతులైన నటులు నటిస్తున్నారు.

రకుల్‌ప్రీత్ జంటగా కార్తీ చేసిన మునుపటి సినిమా ‘దేవ్’ బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది.