సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళ్తున్నా: ఆర్జీవీ


సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళ్తున్నా: ఆర్జీవీ

సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళ్తున్నా: ఆర్జీవీ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ఏప్రిల్ 11వ తేదీలోపు సర్టిఫెకెట్‌ను అందించలేమని చెప్పిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ – సెన్సార్ బోర్డ్)పై కేసు పెట్టనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆ సినిమా ప్రభావితం చేస్తుందని తమకు పంపిన లేఖలో సెన్సార్ బోర్డ్ తెలిపిందనీ, దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి విరుద్ధంగా లక్ష్మీపార్వతి చేసిన ప్రకటనను కూడా దానికి జోడించిందనీ కూడా ఆయన తెలిపారు. అయితే తన సినిమాకూ, ఆమె ప్రకటనకూ ఏ రకమైన సంబంధమూ లేదని ఆర్జీవీ స్పష్టం చేశారు.

సినిమాటోగ్రఫీ చట్టం 1952లోని సెక్షన్ 4 ప్రకారం ప్రజా ప్రదర్శన నిమిత్తం తన వద్దకు సర్టిఫికేషన్ కోసం వచ్చిన సినిమాని పరిశీలించి సర్టిఫికెట్ జారీ చెయ్యాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుదనీ, లేదంటే సెక్షన్ 5ఏ ప్రకారం సర్టిఫికెట్‌ను నిరాకరించవచ్చని ఆయన తెలిపారు.

కానీ సినిమాని పరిశీలించకుండానే ప్రవర్తన నియమావళి కింద సినిమాకి సర్టిఫికెట్‌ను అందించే ప్రక్రియను వాయిదా వేసే అధికారం సీబీఎఫ్‌సీకి లేదని వర్మ అభిప్రాయపడ్డారు. సీబీఎఫ్‌సీ చర్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రజలకు ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు.

ఒక సినిమాకు సర్టిఫికెట్‌ను జారీ చేసే విషయంలో సీబీఎఫ్‌సీ అనుసరించాల్సిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందనీ, ఆ నిబంధనల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని అంశాలేవీ ఉల్లంఘించడం లేదనీ వర్మ స్పష్టం చేశారు. కానీ కనీసం తమ సినిమాని చూడకుండానే అందులో నిబంధనలకు విరుద్ధంగా ఉందనే నిర్ణయానికి సీబీఎఫ్‌సీ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

“ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్థులకు వర్తించే విషయం. ఏ రాజకీయ పార్టీతోనూ, అభ్యర్థితోనూ మా సినిమాకు సంబంధం లేదు. నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ, సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఏ ఒక్కరూ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ తరపునా అభ్యర్థులుగా పోటీ చెయ్యడం లేదు” అని వర్మ వాదించారు.

బాధ్యతాయుతమైన స్థాయిని దుర్వినియోగం చేస్తున్నదనే అంశం కింద సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళ్తున్నానని ఆయన ప్రకటించారు.

సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళ్తున్నా: ఆర్జీవీ | actioncutok.com

You may also like: