Sarvam Thala Mayam Review: 4 Ups and 3 Downs


Sarvam Thala Mayam Review: 4 Ups and 3 Downs

తారాగణం: జీవీ ప్రకాశ్‌కుమార్, అపర్ణా బాలమురళి, నెడిముడి వేణు, వినీత్, సుమేశ్ నారాయణన్, దివ్యదర్శిని, శాంతా ధనంజయన్, కుమరవేల్, మారిముత్తు

దర్శకత్వం: రాజీవ్ మీనన్

విడుదల తేది: మార్చి 8

తమిళ ఒరిజినల్ వచ్చిన ఐదు వారాల తర్వాత తెలుగు ‘సర్వం తాళమయం’ వచ్చింది. కె. విశ్వనాథ్ సహా కొంతమంది తెలుగు సినీ సెలబ్రిటీల ప్రశంసలతో ప్రచారం చేసిన ఈ సినిమాపై క్లాసిక్ సినీ ప్రియులు ఆసక్తిచూపుతూ వచ్చారు. ఏకంగా 18 సంవత్సరాల తర్వాత రాజీవ్ మీనన్ మెగాఫోన్ పట్టిన సినిమా ఇది.

కథ

మృదంగాలను తయారుచేసే జాన్సన్ (కుమరవేల్) కొడుకు పీటర్ (జీవీ ప్రకాశ్). సహజ సంగీతకారుడైన పీటర్ తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటాడు. సంప్రదాయాల్నీ, సంస్కృతినీ కాపాడుతున్నప్పటికీ, తమ జాతి ఎలాంటి గుర్తింపుకూ నోచుకోకుండా మగ్గిపోతున్నదనేది జాన్సన్ ఆవేదన.

తమ షాపు నిమిత్తం ప్రయాణాలు చేసే క్రమంలో పాలక్కాడ్ వెంబు అయ్యర్ (నెడుముడి వేణు)ను కలుసుకుంటాడు పీటర్. మృదంగ విద్వాంసుడిగా ఆయన అనుపమాన నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించి మైమరచిన పీటర్, ఆయన దగ్గర శిష్యరికం చెయ్యాలనుకుంటాడు.

కానీ అది అసాధ్యమని తండ్రి వారిస్తాడు. పీటర్ అనుకున్నది సాధించాడా? లేదా? తన లక్ష్య సాధనలో అతడెదుర్కొన్న అనుభవాలేమిటనేవి మిగతా కథ.

Sarvam Thala Mayam Review: 4 Ups and 3 Downs
కథనం

పైకి కథ బలంగా కనిపించినప్పటికీ కథన లోపాలు స్పష్టంగా తెలుస్తాయి. మృదంగం నేర్చుకొందామని వెంబు అయ్యర్ దగ్గరకు పీటర్ వెళ్లినప్పుడు, ముందుగా అతడ్ని మణి (వినీత్) అడ్డుకుంటాడు. పీటర్ జాతికి కర్ణాటక సంగీతం నేర్చుకోడానికి అనుమతి లేదనీ, ఆ సంగీతం వాళ్ల తలకు ఎక్కదనీ అతను ఎద్దేవా చేసి, అవమానిస్తాడు.

అలా మణిని ఒక ‘చెడ్డ’ బ్రాహ్మణుడిగా చిత్రించాడు దర్శకుడు. వెంబు అయ్యర్ సైతం అదే భావజాలంతో ఉన్నవాడే. కానీ ఆయన మణిలా ఆవేశం ప్రదర్శించకుండా మృదువుగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తాడు. కానీ ఆయనను ‘మంచి’ బ్రాహ్మణుడిగా మనకు అభిప్రాయం కలిగేలా కథనాన్ని మలిచాడు రాజీవ్.

అయ్యర్ ప్రాపకం కోసం తన ఆత్మగౌరవాన్ని వదులుకోడానికి సైతం పీటర్ సిద్ధపడతాడు. నుదుటిపై విభూతి రాసుకుంటాడు. గుళ్లలోకి ప్రవేశించడానికి తాపత్రయపడతాడు. గురువుకు విశ్వాసపాత్రుడైన పెంపుడు కుక్కలా ఉండటానికి సిద్ధపడతాడు. ఆ గురువు కూడా విజ్ఞానం పంచడమనే ధర్మం ప్రకారమే పీటర్‌ను శిష్యుడిగా అంగీకరిస్తాడు.

గమనిస్తే సినిమా మొత్తం కర్ణాటక సంగీతమనేది ఉన్నత కులాల సొత్తనే విధంగా దర్శకుడు చిత్రించడం కనిపిస్తుంది. కర్ణాటక సంగీతం ఒక కులం లేదా ఒక వర్ణం సొత్తు కాదనే విషయాన్ని ఎత్తిచూపడంలో రాజీవ్ విఫలమయ్యాడు. పీటర్ తాలూకు దళిత క్రిస్టియన్ గుర్తింపును అగ్ర వర్ణాల్ని భద్రంగా కాపాడ్డానికే ఉపయోగించాడు.

అందుకు నిదర్శనం, మెడలో శిలువ ఉన్నందున పీటర్‌ను గుళ్లోకి అడుగుపెట్టనీయకుండా ఆపుతారు. అంటే గుడిలో ప్రవేశం మతపరమైన విషయంగా దర్శకుడు చూపించాడు. కానీ నిజం అందుకు భిన్నం. దేశంలోని కోట్లాది మంది దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడానికి కారణం మతం కాదు, కులం.

Sarvam Thala Mayam Review: 4 Ups and 3 Downs
దర్శకత్వం, సంగీతం

‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలతో పా రంజిత్ లాంటి దర్శకులు దళిత గుర్తింపును వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే, ‘సర్వం తాళమయం’తో సమాజాన్ని తిరిగి వెనక్కి తీసుకుపోయే రీతిలో ఈ సినిమాని రాజీవ్ మీనన్ రూపొందించాడని చెప్పడంలో పొరపాటేమీ లేదు.

ఆయన మంచి కథ ఎంచుకున్నాడు కానీ, దాన్ని తెరపైకి తీసుకువచ్చిన తీరు ఆక్షేపణీయం. అంబేద్కర్ భావజాలానికి భిన్నమైన భావజాలాన్ని ఈ సినిమాతో రాజీవ్ ప్రదర్శించాడు.

ఒక టాలెంట్ షోలో, పీటర్‌ను మణి అవమానిస్త్తే, అక్కడుండే బ్రాహ్మణ న్యాయనిర్ణేతల్లో ఏ ఒక్కరూ మణిని ప్రశ్నించకపోవడం దర్శకుడి భావజాలాన్ని పట్టిచ్చే మరొక ఉదహారణ. వాళ్ల సంగతలా ఉంచినా, తన ఆత్మగౌరవం కోసమైనా మణిని పీటర్ నిలదీయడు. కానీ వెంబు అయ్యర్‌ను మణి అవమానిస్తే మాత్రం, అతడ్ని కొట్టడానికి తయారవుతాడు.

అన్ని రకాల సామాజిక కారకాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, కేవలం ప్రతిభ ఆదారంగానే విజయం సాధించాలని పీటర్ ప్రయత్నించినట్లు చూపడమంటే సమాజంలో వేళ్లూనుకొనిపోయిన కుల వ్యవస్థని ప్రశ్నించకూడదని చెప్పడమే. ఈ విషయంలో మాత్రం రాజీవ్ తీవ్రంగా అసంతృప్తి కలిగిస్తాడు.

ఈ సినిమాకి సంబంధించిన బలాల్లో ముఖ్యమైంది సంగీతం. టైటిలే ‘సర్వం తాళ మయం’ అయినప్పుడు సంగీతానికి ప్రాముఖ్యం తప్పనిసరి కదా. ఎ.ఆర్. రెహమాన్ వంటి సంగీతకారుడే సంగీత దర్శకుడైతే, ఈ సంగీత ప్రధాన చిత్రానికి కొదవేముంటుంది! తనకే సాధ్యమైన బాణీలను ఈ సినిమా కోసం సృజించాడు రెహమాన్.

ఒక్క త్యాగరాయ కీర్తన మినహాయించి మిగతా పాటలన్నీ రాకేందుమౌళి రాశాడు. ‘దరిజేర దీవించు’ పాటని రాజీవ్ మీనన్ స్వయంగా కంపోజ్ చెయ్యడం గమనార్హం. త్యాగరాయ కీర్తనను బాంబే జయశ్రీ ఆలపించగా, ‘పీటర్ బీట్ యేసుకో’ పాటను మరో ఇద్దరు గాయకులతో కలిసి జీవీ ప్రకాశ్ పాడాడు. పాటలన్నీ బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం చక్కగా అమరింది.

Sarvam Thala Mayam Review: 4 Ups and 3 Downs