‘వెంకీ మామ’కు సెక్యూరిటీ!


'వెంకీ మామ'కు సెక్యూరిటీ!

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమాకు సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలో జరుగుతోంది.

ఫిబ్రవరి 24న అక్కడ చిత్రీకరణ మొదలైంది. అయితే స్థానిక యువకులు అత్యుత్సాహంతో తమ సెల్‌ఫోన్లతో షూటింగ్ సన్నివేశాల్ని వీడియో తీసి, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తుండటటం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఈ లీకుల వల్ల సినిమాకి దెబ్బ పడుతుందని భావించిన నిర్మాతలు షూటింగ్ లొకేషన్లలో భద్రత పెంచారు.

బయటి వ్యక్తులెవరూ షూటింగ్ స్పాట్‌కు రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతో స్థానికులు అసంతృప్తికి గురవుతున్నారు. సెల్‌ఫోన్లు లేని కాలంలో ఈ గొడవ ఉండేది కాదు కాబట్టి చుట్టుపక్కల వాళ్లు షూటింగ్ చూడ్డానికి తండోపతండాలుగా వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు.

ఇప్పుడు సెల్‌ఫోన్ల గొడవతో తమ ప్రాంతంలో పెద్ద హీరోల సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసినా చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది అత్యుత్సాహవంతుల కారణంగా అందరికీ అసంతృప్తి కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. మొదట్లో చూసీ చూడనట్లు వ్యవహరించిన ‘వెంకీ మామ’ నిర్మాతలు, ఇప్పుడు లీకుల కారణంగా భద్రతా ఏర్పాట్లు చేసుకొని షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ రైస్‌మిల్ యజమానిగా, చైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా, వాళ్ల సరసన పాయల్ రాజ్‌పుట్, రాశీ ఖన్నా నటిస్తున్నారు.

సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.