‘దటీజ్ మహాలక్ష్మి’ విడుదల తేది, కథాంశం, తారాగణం, మీరు తెలుసుకోవాల్సిన విశేషాలన్నీ!


'దటీజ్ మహాలక్ష్మి' విడుదల తేది, కథాంశం, తారాగణం, మీరు తెలుసుకోవాల్సిన విశేషాలన్నీ!

కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ (2014) ప్రప్రంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది బ్లాక్‌బస్టర్ హిట్టయింది. వికాస్ బెహల్ రూపొందించిన ఈ చిత్రంతో కంగన సూపర్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

2017 సెప్టెంబర్‌లో ‘క్వీన్’ తెలుగు వెర్షన్‌లో నాయికగా తమన్నా నటిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడిగా మొదట నీలకంఠను ప్రకటించి, తర్వాత ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మను తీసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో, ప్రశాంత్ కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ పేరు లేకుండానే సినిమా విడుదలవబోతోంది. మరోవైపు నీలకంఠ మలయాళ వెర్షన్ ‘జమ్ జమ్’కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

‘దటీజ్ మహాలక్ష్మి’ ఎప్పుడు విడుదలవుతుంది?

మార్చి 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత మను కుమరన్ ప్రకటించారు. జనవరి 18న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి పరీక్షల సీజన్‌లో ధైర్యంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. జనవరి 16న పెళ్లి పాట లిరికల్ వీడియోను విడుదల చేయడంతో ప్రమోషన్ ఊపందుకుంది. తమన్నాను హిందీ సినీ విశ్లేషకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రా చేసిన ఇంటర్వ్యూను ప్రమోషన్‌లో ఉపయోగిస్తున్నారు.

సినిమా విశేషాలేంటి?

2014 జూన్‌లో ‘క్వీన్’ నిర్మాతలైన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఆ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కుల్ని స్టార్ మూవీస్ అధినేత త్యాగరాజన్‌కు అమ్మినట్లు అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆ హక్కుల్లో అధిక భాగాన్ని మెడియంటే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లిమిటెడ్ అధినేత మను కుమరన్ సొంతం చేసుకున్నారు. త్యాగరాజన్‌తో పాటు మరి కొంతమంది నిర్మాణ భాగస్వాములుగా మారారు.

‘100% లవ్’ సినిమాలో తమన్నా చేసిన మహాలక్ష్మి పాత్రకు మంచి పేరు రావడంతో పాటు అందులో ఆమె ఊత పదం ‘దటీజ్ మహాలక్ష్మి’ పాపులర్ అయింది. దాన్నే ఈ సినిమాకు టైటిల్‌గా నిర్మాతలు ఎంచుకున్నారు. మిగతా దక్షిణాది భాషలతో పాటు ఏక కాలంలో ఈ సినిమా షూటింగ్ అధిక భాగం ప్యారిస్‌లో జరిగింది. ఒకే సారి 4 భాషల్లో నలుగురు హీరోయిన్లతో తీయడం వల్లే, షూటింగ్‌లో జాప్యం జరిగింది.

‘దటీజ్ మహాలక్ష్మి’ కథాంశమేమిటి?

చివరి నిమిషంలో పెళ్లికొడుకు నిరాకరించడంతో ఎన్నో కలలతో పెళ్లికి సిద్ధమైన పల్లెటూరమ్మాయి మహాలక్ష్మి, ఆ బాధను దిగమింగుకొని, అప్పటికే ప్యారిస్‌లో హనీమూన్ కోసం వచ్చిన టికెట్లతో తనొక్కతే హనీమూన్‌కు వెళ్తుంది.

అక్కడి నుంచి తిరిగొచ్చేలోపు ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, కలుసుకున్న మనుషులు, స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకున్న విధానం, ఒక పరిపూర్ణ స్త్రీగా ఆమె సంతరించుకున్న వ్యక్తిత్వం ఏమిటనేదే ఈ సినిమా. ఇందులో మహాలక్ష్మి రాజమండ్రి అమ్మాయిగా మనకు కనిపిస్తుంది.

'దటీజ్ మహాలక్ష్మి' విడుదల తేది, కథాంశం, తారాగణం, మీరు తెలుసుకోవాల్సిన విశేషాలన్నీ!
‘దటీజ్ మహాలక్ష్మి’ ట్రైలర్ వచ్చిందా?

ఇంకా థియేట్రికల్ ట్రైలర్ రాలేదు కానీ, 2018 డిసెంబర్‌లో ఒక నిమిషం పైగా నిడివి ఉన్న టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. అందులో తమన్నా రాజమండ్రి నుంచి హనీమూన్ కోసం ఒంటరిగా ప్యారిస్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడివాళ్లకు రాజమండ్రి బ్రిడ్జి ముందు ఐఫిల్ టవర్ ఉడత లాగా కనిపిస్తుందని చెబుతుంది. ప్యారిస్‌లో మహాలక్ష్మి పడ్డ అవస్థలు కొన్ని టీజర్‌లో చూపించారు. ‘క్వీన్’ సినిమా గురించి తెలీని సాధారణ ప్రేక్షకుల్ని ఈ టీజర్ బాగానే ఎట్రాక్ట్ చేసింది.

ఇప్పటివరకూ విడుదల చేసిన ‘లండన్ దాకా ఢోల్ బాజే’, ‘కథ మొదలవకే’ పాటలు ఆకట్టుకున్నాయి. మొదటిది హుషారు గీతమైతే, రెండోది దానికి పూర్తి భిన్న తరహాలో వేదనాభరితంగా సాగే మాంటేజ్ సాంగ్.

థియేట్రికల్ ట్రైలర్ ఈ వారంలోనే విడుదల కానున్నది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశాలున్నాయి.

తారాగణం ఎవరు?

ఒరిజినల్‌లో కంగనా రనౌత్ పోషించిన పాత్రను తెలుగు వెర్షన్‌లో తమన్నా చేసింది. ‘బాహుబలి’ నాయిక అవంతిక పాత్రలో తమన్నా తెచ్చుకున్న క్రేజ్ ఈ సినిమాలో నాయికగా నటించే అవకాశాన్ని కల్పించింది. ఇటీవలి ‘ఎఫ్2’ సక్సెస్‌తో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది.

మహాలక్ష్మిని పెళ్లి చేసుకోడానికి సిద్ధమై చివరి నిమిషంలో అడ్డం తిరిగిన పెళ్లికొడుకుగా సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తాడు. ఒక చిన్న స్థాయి నటుడిగానే తెలిసిన అతనికి కొద్దో గొప్పో గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంటూర్ టాకీస్’.

ఒరిజినల్‌లో లీసా హెడెన్ చేసిన విజయలక్ష్మి కేరెక్టర్‌ను హిందీ నటి, గాయని శిబానీ దండేకర్ పోషించింది. ‘నూర్’ (హిందీ) సినిమాలో జారా పటేల్ పాత్రలో ఆకట్టుకొన్న ఆమె ‘నామ్ షబానా’, ‘భవేష్ జోషి’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించింది.

మిగతా నటుల్లో గీతాంజలి, సీవీఎల్ నరసింహారావు, రూపలక్ష్మి తెలుగు తారలు కాగా, ఫ్రెంచి తారలూ ఈ సినిమాలో నటించారు.

– సజ్జా వరుణ్
'దటీజ్ మహాలక్ష్మి' విడుదల తేది, కథాంశం, తారాగణం, మీరు తెలుసుకోవాల్సిన విశేషాలన్నీ!